టిఆర్‌ఎస్‌ కార్యవర్గాల కోసం ఎదురుచూపు

వరంగల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): వరంగల్‌ జిల్లా అయిదు జిల్లాలుగా విడిపోయిన క్రమంలో అవకాశాలు పుష్కలంగా ఉండడంతో పలువురు కొత్త నేతలూ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుల నియామకానికి కొన్ని పార్టీలు ఇప్పటికే శ్రీకారం చుట్టగా, మరికొన్ని పార్టీల్లో కసరత్తు సాగుతోంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా.. జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసే పక్రియకు కసరత్తు జరుగుతోంది. విధేయులు.. జిల్లాలో గుర్తింపు.. పార్టీని ముందుకు నడిపే సమర్థత ఉన్న నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుల ఎంపికలో విధేయతకే ఆయా పార్టీల అధిష్ఠానం పెద్ద పీట వేయనుంది. సమర్థతతోపాటు పార్టీ పట్ల వారికున్న అభిమానం కొలమానంగా ఎంపికలు జరుగుతున్నాయి. గతంలో ఇతర పార్టీలలో పనిచేసి వచ్చిన వారి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికి వారు మన పార్టీలోనే ఉంటారా అనే కోణంలోనూ తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారి పనితీరుపై సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్న తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే కోవలో జిల్లా అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందనే కోణంలో సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ సైతం అదే అడుగుజాడల్లో పయనిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌ కంటే తమకే అనుకూల పరిస్థితులు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్న కమలనాధులు కొత్త రథసారదుల ఎంపికకు ఇప్పటికే చర్యలు మొదలెట్టింది.