ప్రచారానికి తెర..

– నేటితో ముగియనున్న పురపాలక ప్రచారం

– ప్రలోభాలపై ఈసీ నిఘా..

– కరీంనగర్‌ మినహా అంతటా ప్రచారానికి తెర

– జోరుగా ప్రచారం చేపట్టిన పార్టీల నేతలు

– అన్నింటా ముందున్న అధికార టిఆర్‌ఎస్‌

హైదరాబాద్‌,జనవరి 19(జనంసాక్షి): రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గడువు ముగిసిన తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టవద్దని అన్ని పార్టీలకు ఆదేశాలు జారీ చేసింది. సభలు, సమావేశాలకు అనుమతి లేదని.. రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని ఈసీ ప్రకటన విడుదల చేసింది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ద్వారా కూడా ప్రచారం చేయకూడదని తెలిపింది. కాగా, ఈ నెల 22న 9 నగరపాలక సంస్థలకు, 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.కాగా పురపాలక ఎన్నికల్లో అధికార,ప్రతిపక్ష పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. కరీంనగర్‌ మినహా అన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. 22న ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రెండురోజులే గడువు ఉండడంతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు గల్లీగల్లీ తిరుగతూ ప్రభుత్వ పథకానలు ఏకరువు పెడుతున్నారు. ఇక బిజెపి నుంచి లక్ష్మణ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి,ఎంపలు అర్వింద్‌, సోయం బాపూరావు, బండి సంజయ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఉత్తమ్‌, రేవంత్‌, కోమటిరెడ్డి, పొన్నాల తదితరులు ప్రచారం చేపట్టారు. ఎన్నికలు జరుగుతున్న అన్ని వార్డులకు అభ్యర్దులను నిలబెట్టలేని దుస్థితిలో విపక్షాలు ఉన్నాయని అధికార టిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. ఇందులో కాంగ్రెస్‌తో పాటు బిజెపి ఉండడం విశేషం. ఇక టిడిపి, వామపక్షాలు అయితే మరీ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. కనీసం సగంలో సగం మంది అభ్యర్ధులను కూడా బరిలోకి దించలేకపోయాయి. ప్రస్తుతం మొత్తం 3,052 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటికే సుమారుగా ఎనభై వార్డులను కైవసం చేసుకున్న అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ మరో 2,972 వార్డుల్లో అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ 2,616 మంది అభ్యర్ధులను నిలపగా, బిజెపి నుంచి 2,313 మంది అభ్యర్ధులు, టిడిపి నుంచి 347 మంది, వామపక్షాల నుంచి 343 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. ఈ అభ్యర్ధులంతా ఈ నెల 22న జరిగే పోలింగ్‌ పక్రియలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యమ్నాయం అంటూ పదేపదే కమలనాధులు ప్రచారం చేస్తున్నారు. బిజెపికి గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఆ పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది. అందకే రాష్ట్రంలో మొత్తం 3,052 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా ఆ పార్టీ 2,313 మందిని మాత్రమే అభ్యర్ధులను బరిలోకి దింపగలిగింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ కూడా పలు వార్డుల్లో అభ్యర్ధులను బరిలోకి దింపలేకపోయింది. ఆ పార్టీ కేవలం 2,616 వార్డులకు మాత్రమే అభ్యర్ధులను బరిలో నిలిపింది. మున్సిపల్‌ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు మాసంలోనే నిర్వహించాలని శతవిధాలుగా యత్నించింది. అయితే కోర్టుల్లో పలు కేసుల కారణంగా దాదాపు ఐదు మాసాల ఆలస్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు బలమైన పార్టీగా ముద్రపడిన టిడిపి కూడా పురపోరులో దయనీమైన పరిస్థితినే ఎదుర్కొన్నది. సగంలో సగం మంది అభ్యర్ధులను కూడా నిలబెట్టలేకపోయింది. ఇక వామపక్షాలది కూడా అదే పరిస్థితి. కాగా మజ్లిస్‌ పార్టీ మాత్రం ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్న వార్డులను ఎంచుకోని పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ 276 వార్డుల్లో అభ్యర్ధులను బరిలో నిలబెట్టగలిగింది. మొత్తం విూద రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు బయటకు మాత్రం కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్దంగా కనబడుతోంది. ఏదేమైనా పురపోరు చరమాంకానికి చేరింది. అధికార పార్టీ అన్నిటికన్నా ప్రచారంలో ముందున్నది.