యూరియా కొరత సిఎం కెసిఆర్‌కు కనిపించడం లేదా: సిపిఐ

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌9(జనం సాక్షి ) :  యూరియా కొరత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని సీపీఐ నేత ఆరోపించారు. విపక్షాలకు ఎజెండా లేదని, లేని సమస్యలతో యాగీ చేస్తున్నారని సిఎం కెసిఆర్‌ వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. యూరియా సమస్య కాదా అని అన్నారు. రైతులు క్యూలు కడుతున్నది కనిపించడం లేదా అని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ వైఖరి మార్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాల విమర్శలను హుందాగా స్వీకరించాల్సిందిపోయి, బెదరగొడతామనడం ప్రజల గొంతు నొక్కడమేనన్నారు. యూరియా కొరత అంతటా ఉందని,  సీఎం నియోజకవర్గం గజ్వెల్‌లో కూడా ఉన్నదని, రైతులు చెప్పులను లైన్లలో పెట్టే దృశ్యాలు కన్పించడం దురదృష్టకరమన్నారు. యాదాద్రి ఆలయంలో స్తంభాలపై కేసీఆర్‌ బొమ్మ చెక్కడం, ఆయన రాచరిక పోకడలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని హితవుపలికారు. తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు విమోచనం గురించి తెలియజేసేందుకే ఈనెల 11 నుంచి 17 వరకు వారోత్సవా లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.