వర్షాలతో మత్స్యకారుల్లో ఆనందం

చెరువుల్లో నీటి చేరికతో చేపల పెంపకానికి అనుకూలం
ఖమ్మం,జూలై10(జ‌నంసాక్షి): జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో చెరువుల్లోకి నీరు చేరుతోంది. ఇది మత్స్యకారులకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు అన్నారు. వైరాతోపాటు ఖమ్మంలో మత్స్య విత్తన క్షేత్ర కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలతోపాటు కాంట్రాక్టర్లు తాము లీజుకు తీసుకున్న పరిధిలో కూడా చేప పిల్లలను ఉత్పత్తి చేయనున్నారు. ప్రస్తుతం చెరువుల్లో పోసేందుకు రెండున్నర అంగుళాల పొడుగు ఉన్న చేప పిల్లలను కాంట్రాక్టర్ల ద్వారా కొనుగోలు చేయనున్నారు. మిగిలిన చెరువుల్లో ఒకటిన్నర అంగుళాల చేప పిల్లలను పోసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిరుడు జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు పోసేందుకు ప్రభుత్వం రూ.2.65 కోట్లు నిధులు కేటాయించటంతో సత్ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది రూ.3 కోట్లతో టెండర్ల పక్రియను అధికారులు పూర్తిచేశారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా నిరుటి నుంచి రాష్ట్రంలోని నీటి నిల్వ ఉన్న చెరువుల్లో నూరు శాతం సబ్సిడీపై ప్రభుత్వం చేప పిల్లలను పోసి మత్స్యకారులకు ఉపాధిని కల్పిస్తోంది. వారు ఆర్థికాభివృద్ధి సాధించేలా కృషిచేస్తోంది. జిల్లాలో 1162 చెరువులు ఉండగా నిరుడు 716 చెరువుల్లో 3.09 కోట్ల చేప పిల్లలను పోశారు. ఈ చేప పిల్లలను చెరువుల్లో పెంచడంతో జిల్లాలో సంవత్సరం మొత్తం 12 వేల టన్నుల చేపలు ఉత్పత్తి అయ్యాయి.జిల్లాలో మొత్తం 177 మత్స్యకార్మిక సహకార సంఘాలు ఉండగా.. వీటిల్లో 25 మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లోని సభ్యులంతా మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ సంవత్సరం జిల్లాలోని 985 చెరువుల్లో ప్రభుత్వం 3.57 కోట్ల చేప పిల్లలను పోయనుంది. ఇప్పటికే జిల్లా మత్స్యశాఖ అధికారులు టెండర్ల పక్రియను పూర్తి చేశారు.  జిల్లాలోని పాలేరు, వైరా, లంకాసాగర్‌, బేతుపల్లి గంగారం రిజర్వాయర్లలో 13లక్షల రొయ్య పిల్లలను కూడా ఈ ఏడాది ప్రభుత్వం ఉచితంగా పోయనుంది. వాటిల్లో చేపల పెంపకానికి అనువైన చెరువులను మాత్రమే అధికారులు ఎంపిక చేశారు.