సాగు లెక్కలు సేకరణలో వ్యవసాయశాఖ

పంటకాలనీల కోసం వివరాల నమోదు

నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలో వ్యవసాయ భూములు, సాగు లెక్కలను వ్యవసాయ విస్తరణాధికారులు చేపట్టారు. క్షేత్రస్థాయిలో రైతుల వారీగా భూములు, పంటల సాగు, నీటి వసతి, బీడు భూముల తదితర వివరాలతో కూడిన నమునాలో వివరాలను సేకరించారు. పంటకాలనీలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా వీటిని సేకరించారు. దీంతో ఏ భూమిలో ఏ పంట వేయాలన్నది ఇక ప్రభుత్వం దగ్గరుండి సూచించనుంది. రైతుల పేర్లు, గ్రామం, మండలం, భూముల వివరాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు పుస్తకం, క్రెడిట్‌కార్డు, పాన్‌కార్డు, పంటల సాగు, నీటివసతి, ఫోన్‌ నెంబరు, ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం ఏయే పంటలు సాగు చేస్తున్నారన్న వివరాలు సేకరిస్తున్నారు. బీడు భూమి ఎంత, తదితర అంశాలతో కూడిన పూర్తి సర్వే చేసే పనిలో ఏఈవోలు మునిగిపోయారు. సర్వే పనులను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న సర్వే పూర్తయితే జిల్లాలో వ్యవసాయ రంగం సమగ్ర స్వరూపం తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో కమతాల వారీగా వ్యవసాయ పంటల సాగు వివరాలను నమోదు చేసారు. పక్కా వివరాలను తొందరగా అందజేయాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్‌ జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించడంతో వివరాలను కిసాన్‌పోర్టులో నమోదు చేస్తున్నారు. జిల్లాలో 31 మండలాల్లో సుమారు 16లక్షల జనాభా ఉండగా 3.20లక్షల హెక్టార్ల సాగుభూమి ఉంది. ప్రస్తుతం 2.90లక్షల హెక్టార్ల భూమి సాగవుతుంది. 3.70లక్షల మంది రైతులు జిల్లాలో ఉన్నారు. సాగుకు సంబంధించిన పూర్తి పణాళికలను సిద్ధం చేసేందుకు అవసరమైన కసరత్తు జరుగుతోంది. దీంతో ఎరువులు, విత్తనాలు కేటాయింపులు చేసేందుకు వ్యవసాయ అధికారులకు స్పష్టమైన లెక్క తెలుస్తుంది. నీటి వసతి ఉన్న చోట ఏ మేరకు పంటల సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో స్త్రీ, పురుష నిష్పత్తి, వ్యవసాయ కమతాల సగటు విస్తీర్ణం స్పష్టంగా తెలుస్తాయని, తద్వారా వ్యవసాయానికి అవసరమైన సాయం అందించే చర్యలకు అవకాశం ఏర్పడుతందని భావిస్తున్నారు.ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో వ్యవసాయ సాగు వివరాలను ఏటా రెవెన్యూ సిబ్బంది సేకరిస్తున్నారు. వ్యవసాయశాఖ సిబ్బంది కొరత వల్ల సర్వే చేసినప్పటికి రెవెన్యూ అధికారుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. రైతుల లెక్క పక్కాగా లేవకపోవడం వల్ల విత్తనాలు, ఎరువులు ఇతర వ్యవసాయ పరికరాల కేటాయింపులో తక్కువ కావడం, మిగిలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకుండా పక్కాగా ఉండేందుకు పక్కా సర్వే కోసం ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. వ్యవసాయ భూమి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏఈవోల వద్ద ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.