22న నిర్మల్‌లో సిఎం కెసిఆర్‌ ప్రచార సభ

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఈ నెల 22న నిర్మల్‌లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావ సభ కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. నటరాజ్‌ మిల్‌ సవిూపంలోని ఎల్లపల్లి క్రషర్‌ రోడ్‌ వద్ద విశాలమైన స్థలంలో బహిరంగ సభను ఖరారు చేశారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ… సభ నిర్వహించడానికి అనువైన స్థలం కోసం మూడు ప్రాంతాలను పరిశీలించామని, క్రషర్‌ రోడ్‌ స్థలం అన్నింటికీ అనువైనదిగా భావించి, ఇక్కడే సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 60 వేల మందితో సభను నిర్వహిస్తామని చెప్పారు. నిర్మల్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీ ఎత్తున ప్రజలను సవిూకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి నియోజవర్గంలోని మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున లబ్ధిపొందిన ప్రతీ ఒక్కరు తరలిరావాలని, బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. మంత్రి వెంట జిల్లా ఎస్పీ శశిధర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, నిర్మల్‌ ఏయంసీ ధర్మాజీ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు శ్రీహరి రావు, డా.మల్లికార్జునరెడ్డి, రాంచందర్‌, అశోక్‌, రెవెన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.