పొన్నాలను పక్కన పెట్టే ప్రయత్నం?

 

పిసిసిలో ఓ వర్గం వ్యతిరేకంగా పనిచేస్తుందా?

నియోజకవర్గంలో జోరుగా చర్చ

జనగామ,నవంబర్‌10(జ‌నంసాక్షి): జనగామలో ఒక్కసారిగా ఇప్పుడు రాజకీయ కలకలం రేగుతోంది. తెలంగాణ ఉద్యమనేత, జెఎసి ఛైర్మన్‌గా ఉన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఇక్కడ పోటీ చేయడం ఖాయమన్న వార్తలతో ప్రజల్లో ఆనందోత్సాహాలు వ్యక్తం అయ్యాయి. అలాగే తెలంగాణ వాదులు కూడా మంచి నిర్ణయమని భావిస్తున్నారు. కోదండరామ్‌ వస్తే గెలుపు సులువని అన్నారు. ఇదిలా ఉండగా పొన్నాలను కావాలనే కాంగ్రెస్‌లోని ఓ వర్గం పక్కనబెట్టాలని చూస్తోందని కొంత కాలంగా చర్చసాగుతోంది. ఇప్పుడు ఇదే నిజం కాబోతున్నదని అంటున్నారు. వయోపరిమితి నిబంధనతో పొన్నాల సీటు కోల్పోతారని ప్రచారం జరిగినా రాహూల్‌గాంధీ, కుంతియాతో పాటు ఇతర జాతీయస్థాయి నేతలను కలిసి పదిలం చేసుకున్న తరువాతే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడకముందు నుంచే టీజేఎస్‌ వ్యవస్థాపకుడు కోదండరాం జనగామలో పోటీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. పొత్తులు అధికారికంగా ఖరారు కానప్పటికీ జనగామ స్థానాన్ని మహాకూటమికి కేటాయించనుందని ప్రచారం జరగడంతో టీజేఎస్‌ వ్యవస్థాపకుడు కోదండరాం బరిలో నిలవనున్నారని భావిస్తున్నారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో సిద్దిపేటకు వెన్నుదన్నుగా నిలిచిన చేర్యాల, జనగామ ప్రాంతాలలో కోదండరాం పర్యటించి ఊపు తీసుకువచ్చారు. జనగామ జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొని ఈ ప్రాంత ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలకు చెందిన పలువురు ఆయనతో టచ్‌లో ఉండటం, పొన్నాల, ముత్తిరెడ్డిల వైఫల్యాలు కలిసి వస్తాయని స్థానికులు గెలుపు సంకేతాలందించడంతో ఆయన కూడా జనగామను కోరినట్లు తెలుస్తోంది. పొన్నాల గతంలో ఎన్నోమార్లు పోటీ చేశారని, గత ఎన్నికల్లో ముత్తిరెడ్డి చేతిలో ఓడిపోయారని అంటున్నారు. నియోజకవర్గానికి ప్రాధాన్యం రావాలంటే కోదండరామ్‌ పోటీ చేయడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇకపోతే టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య సీటుకు ఎసరు తెచ్చేలా ఉందన్న ప్రచారం వ్యాపించడంతో ఆయన అభిమానులు,కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పొన్నాలను తప్పిస్తే సహించబోమని క్యాడర్‌ తేల్చిచెబుతుంటడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పొన్నాల జనగామలో నాలుగుసార్లు విజయం సాధించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే గత ఎన్నికలు జరిగాయి. కానీ జనగామలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డిపై ఓటమి చవిచూశారు.