కరీంనగర్‌లో నేడు బిజెపి ఏక్తా యాత్ర


సమాయత్తం చేస్తున్న బిజెపి శ్రేణులు
కరీంనగర్‌,మే 24 (జనంసాక్షి): హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 25న కరీంనగర్‌లోని వైశ్య భవన్‌ నుంచి హిందూ ఏక్తా యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పిలుపు మేరకు నగరంలో ఈ యాత్ర చేపట్టనున్నారు. తెలంగాణలోని హిందూ సమాజ ఐక్యతను చాటిచెప్పేందుకు నిర్వహించే ఈ యాత్రకు వేలాదిగా హిందూ బంధువులు తరలిరావాలని స్థానిక బిజెపి నేతలు పిలుపునిచ్చారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని 12 సంవత్సరాలుగా కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహిస్తున్నామని, కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు ఈ యాత్రను నిర్వహించలేక పోయామని అన్నారు. ఈసారి భారీ ఎత్తున కరీంనగర్‌లోని వైశ్యభవన్‌ నుంచి హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. వేలాదిమంది హిందూ బంధువులు ఈ యాత్రకు తరలివచ్చి తెలంగాణలోని హిందూ సమాజ సంఘటిత శక్తిని, ఐక్యతా స్ఫూర్తిని మరోసారి చాటి చెప్పాలన్నారు. ఈసారి సింగపూర్‌, దుబాయ్‌ సహా విదేశాల నుంచి పెద్ద ఎత్తున యువత ఈ యాత్రలో పాల్గొనేందుకు వస్తున్నారని అన్నారు. ఈసారి హిందూ ఏక్తా యాత్రకు సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసనంద స్వామిజీ అతిథిగా హాజరై భక్తులకు మార్గదర్శనం చేయబోతున్నారన్నారు.ఈ యాత్రలో భాగంగా భక్త హనుమాన్‌, శ్రీరామ చంద్రస్వామి విగ్రహాలను తయారు చేశామని అన్నారు. ఈసారి పెద్ద ఎత్తున హనుమాన్‌ వేషధారులు ఈ యాత్రలో పాల్గొంటారని అన్నారు. ఈ నెల 25న సాయంత్రం 4:30 గంటలకు కరీంనగర్‌ వైశ్య భవన్‌ నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు.