దుబ్బాక నిధులు ఎందుకు తరలాయి?

ముత్యం రెడ్డి అభివృద్ది ఎందుకు ఆగింది
ప్రచారంలో టిఆర్‌ఎస్‌ను నిలదీస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డి
సిద్దిపేట,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులను తరలించుకుపోయిన మంత్రి హరీశ్‌రావు ఇప్పుడు ఎలా ఓట్లడుగుతున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మెల్యేగా తన తండ్రి తెచ్చిన అభివృద్ధి పనుల్లో ఒక్కటి కూడా పూర్తి చేయలేక పోయారని మండిపడ్డారు. పనులన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు మిగిలిపోయాయని తెలిపారు. నియోజకవర్గంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి తప్ప దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చేసిందేవిూ లేదని విమర్శించారు. ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో దుబ్బాక నియోజకవర్గంపై హరీశ్‌రావు సవితి తల్లి ప్రేమ చూపించారని.. మళ్లీ ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటే ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గ పరిస్థితులపై ఏమాత్రం అవగాహనలేని సోలిపేట సుజాతను గెలిపించుకుంటే వచ్చిన నిధులను సిద్దిపేట, గజ్వేల్‌కు తరలించవచ్చని హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.  పలు గ్రామాల్లో పర్యటించిన  సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి వచ్చిన నిధులన్నీ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటకు తరలించుకుపోయారని ఆరోపించారు. హరీశ్‌రావు వచ్చి అభివృద్ధి చేస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ గెలిస్తే అభివృద్ధిలో దుబ్బాక మరో పదేళ్లు వెనక్కి పోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇదిలావుంటే చెరుకు ముత్యం రెడ్డి భార్య కూడా ప్రచారంలో దూసుకుని పోతోంది. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున పోటీచేస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని చెరుకు విజయలక్ష్మి ఓటర్లను అభ్యరించారు. ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు.దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది దివంగత ముత్యంరెడ్డి
హయాంలోనే అని ఆమె గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గాన్ని అన్నింటిలో ముందంజలో నిలిపేందుకు ఆయన వారసుడు ముందుకొచ్చాడన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు.