రైతాంగ సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చింతకుంట్ల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నేటికి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ధర్నా నిర్వహించి మాట్లాడారు. ధరణి పోర్టల్ వచ్చిన నాటి నుండి అనేక ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా రైతులు తమ భూములకు పాసు పుస్తకాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తక్షణమే ధరణి పోర్టల్ రద్దు చేసి పాత పద్ధతిలో రైతుల భూములకు హక్కులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు కూడా అమలు చేయకుండా రైతులను మోసం చేసింది అన్నారు. పోడు భూములతో పాటు దళితులు సాగు చేసుకుంటున్నా అసైన్డ్ భూములకు ఎస్సీ ఎస్టీలకు పట్టాలిచ్చి హక్కులు కల్పించాలన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్లు బిగించకుండా చూసి రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ను అందించాలన్నారు. రైతు బీమాను 10 లక్షల రూపాయలకు పెంచడంతోపాటు రైతుబంధు సొమ్మును సకాలంలో రైతుల ఖాతాలో జమ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆవు దొడ్డి ధన మూర్తి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, షాబుద్దీన్, గంధం యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, కాంపాటి శ్రీను, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, పాలూరి సత్యనారాయణ, సైదిబాబు ,మైనార్టీ నాయకులు గులాం ఎస్ దాని ,బాగ్దాద్, భాజాన్, దావల్, ముస్తఫా, రజనీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.