కాంగ్రెస్సే లక్ష్యం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి):  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు టిజెఎసి ఆధ్వర్యంలో నెలరోజుల కార్యాచరణను ప్రకటించింది. సోమవారంనాడు టిఎన్‌జివో భవన్‌లో జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమావేశమై కార్యాచరణపై చర్చించింది. అనంతరం జెఎసి చైర్మన్‌ కోదండరాం మీడియాకు వివరాలను వెల్లడించారు. రిపబ్లిక్‌డే లోపుగా తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని సమావేశం డిమాండ్‌ చేసిందన్నారు. జనవరి నెల అంతా తెలంగాణ వాదులు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలునునిచ్చారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెస్‌, టిడిపి, వైసిపి నేతలపై తమ ఒత్తిడి కొనసాగుతుందన్నారు. అన్ని పార్టీల నేతలతో పాటు మంత్రులపై కూడా ఒత్తిడి పెరిగేలా వారివారి నియోజకవర్గాలలో ప్రచార, నిరసన కార్యక్రమాలునిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణపై తీర్మానం చేయాలని వైసిపి, తెలుగుదేశంపార్టీలు డిమాండ్‌ చేయాలన్నారు. టిడిపి రాజకీయ అవకాశవాదమని  విమర్శించారు. వైయస్సార్‌ సీపీ గొడమీద పిల్లి వాటంలా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు తెలంగాణపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. యూపిఏ భాగస్వామ్య పక్షాలకు లేఖలు రాసి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌లపై ఒత్తిడి పెంచుతామని కోదండరాం చెప్పారు. ఢిల్లీలో కూడా ధర్నా నిర్వహించాలని యోచిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో కూడా భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రత్యేక తెలంగాణను గట్టిగా డిమాండ్‌చేస్తామన్నారు. కేంద్రం నెలరోజులలోపు తెలంగాణపై రోడ్డు మ్యాప్‌ ప్రకటించాలన్నారు. తెలంగాణ కోసం తెలంగాణ వాదులు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నగారా సమితి కన్వీనర్‌ నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్దికోసం సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతియ్యద్దని విజ్ఞప్తిచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నెలరోజులలో కేంద్రం తెలంగాణ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. జెఎసి భాగస్వామ్య పక్షాలతో పాటు టిఎన్జీవో, టిజివో నేతలు దేవీ ప్రసాద్‌, విఠల్‌, శ్రీనివాసగౌడ్‌, స్వామిగౌడ్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.