రవాణా చెక్‌పోస్టులు రద్దు
` తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేత
` సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తక్షణ చర్యలు
` నంబర్ ప్లేట్ రికగ్నేషన్ అమలు
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. దీంతో తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల్లోగా మూసివేతపై పూర్తి నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం రేవంత్ ఆదేశాలతో తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆకస్మిక, తక్షణ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే వేరే బాధ్యతల్లో వినియోగించు కోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. రహదారులపై వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని, చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు. అలాగే చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని హుకుం జారీ చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్‌పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకుని యథేచ్ఛగా అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని రవాణాశాఖ చెక్‌పోస్టులను రద్దు చేస్తూ జులై ఆఖరి వారంలోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నెలరోజులు ఆలస్యంగా జీఓ జారీ అయ్యింది. ఉత్తర్వులు వచ్చి దాదాపు రెండు నెలలు గడుస్తున్నా చెక్‌పోస్టులను ఇంకా తొలగించలేదు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక చెక్‌పోస్టుల అవసరం దాదాపుగా తగ్గింది. కేంద్రం సూచనల మేరకు దేశంలోని అనేక రాష్టాల్రుసంవత్సరాల క్రితమే చెక్‌పోస్టులను రద్దు చేశాయి. కానీ తెలంగాణలో కొనసాగుతున్నాయి. ఏడాదిన్నర క్రితమే తెలంగాణలో చెక్‌పోస్టుల రద్దుకు రవాణాశాఖ నిర్ణయం తీసుకున్నా.. కొందరు అధికారుల బలమైన ఒత్తిళ్ల కారణంగా ఇన్నాళ్లు ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు రెండు నెలల క్రితం జీఓ జారీ అయినా అవినీతి అధికారుల తీరు మారలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్‌పోస్టులు రద్దు చేయాలని రవాణాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టులను ఎత్తివేసిన ప్రభుత్వం వాటి స్థానంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ (ఏఎన్‌పీఆర్) అనే అడ్వాన్స్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ అడ్వాన్స్?డ్ కెమెరా సిస్టమ్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఉన్న ప్రధాన రవాణా శాఖ ఆఫీస్‌కు అనుసంధానమై ఉంటుంది. దీంతో రవాణా శాఖలో పారదర్శకత స్పష్టంగా కనిపించనున్నది. అయితే, ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న సిబ్బందికి కొత్త బాధ్యతలు అప్పగించనున్నారు. ఏ వెహికల్ అయినా కెమెరా కండ్లుగప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే.. వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్ లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేసే వాహన యజమానుల అసోషియేషన్ కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించ నున్నారు. ఇతర రాష్టాల్ర నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్‌తో పాటు సరకు రవాణా వాహనాల పర్మిట్లు, మిగిలిన అనుమతులన్నీ ముందే ఆన్ లైన్ లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇతర రాష్టాల్ర నుంచి అనుమతుల్లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటి వరకు 15 చెక్ పోస్టుల అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర విధుల్లో ఉన్న సుమారు 70 మంది ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఇతర సిబ్బందిని ప్రస్తుతం రవాణా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ రహదారులపై రవాణా సమస్యలు లేకుండా, సాఫీగా ప్రయాణం జరిగేందుకు వీలుగా చెక్ పోస్టులను ఎత్తేయాలని గతంలోనే కేంద్రం ఆయా రాష్టాల్రను ఆదేశించింది.