పసిడి ధరలు పతనం
` ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గుదల
` అదే బాటలో వెండి
హైదరాబాద్(జనంసాక్షి): రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం పసిడి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు రూ.9వేలకు పైగా తగ్గడం గమనార్హం. అటు వెండి ధర కూడా దిగొచ్చింది. బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 గ్రాముల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,25,250కి పడిపోయింది. 22 క్యారెట్ల ధర రూ.1,14,843గా ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.7వేలు తగ్గింది. నేడు కేజీ వెండి ధర రూ.1,58,000 పలుకుతోంది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు రూ.28వేలు తగ్గింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర 4,022 డాలర్లకు పడిపోయింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది. ఇటీవల రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం, వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.