భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి

` త్వరలో సుంకాలు తగ్గించే యోచన
వాషింగ్టన్‌(జనంసాక్షి):సుంకాలను తగ్గించేందుకు భారత్‌ అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందానికి భారత్‌`అమెరికాలు చాలా దగ్గరగా ఉన్నాయని, దీంతో భారత దిగుమతులపై అమెరికా సుంకాలు 50శాతం నుండి 15 నుండి 16శాతానికి తగ్గనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇంధనం, వ్యవసాయంపై ఆధారపడిన ఈ ఒప్పందంతో, క్రమంగా భారత్‌ రష్యా నుండి ముడి చమురు దిగుమతులు తగ్గించుకునే అవకాశం ఉందని తెలిపాయి. సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈ అంశంపై బుధవారం జాతీయ విూడియాలో ఒక కథనం ప్రచురితమైంది. అమెరికాతో చర్చల్లో భాగంగా, జన్యుపరంగా మార్పులు చేయని మొక్కజొన్న, సోయావిూల్‌ దిగుమతులను పెంచడానికి భారత్‌ అనుమతించే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. ఈ ఒప్పందంలో సుంకాలు మరియు మార్కెట్‌ యాక్సెస్‌ను క్రమానుగతంగా సవిూక్షించే యంత్రాంగం కూడా ఉండవచ్చని తెలిపింది. ఈ నెలలో జరగనున్న ఏసియన్‌ శిఖరాగ్ర సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉందని నివేదించింది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వైట్‌హౌస్‌ స్పందించాల్సి వుంది. మంగళవారం భారత ప్రధాని మోడీతో మాట్లాడానని, ఎక్కువగా వాణిజ్యంపై దృష్టిసారించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ఇంధనంపై కూడా చర్చలు జరిపామని ఆయన అన్నారు. రష్యా నుండి భారత్‌ చమురు కొనుగోళ్లను పరిమితం చేస్తుందని మోడీ తనకు హావిూ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్‌, తాను చర్చలు జరిపామని మోడీ కూడా స్పష్టం చేశారు. చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడిరచలేదు.