హెచ్‌1బీ వీసాలకు స్వల్ప ఊరట

` ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారికి ఫీజు మినహాయింపు
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారికి ఊరట. హెచ్‌-1బీ వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఈ ఫీజు చెల్లింపుల విషయంపై అమెరికా పౌరసత్వం, వలస సేవల సర్వీస్‌ కీలక ప్రకటన చేసింది. హెచ్‌1బీ వీసా కోసం పెంచిన లక్ష డాలర్ల ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టంచేసింది. యూఎస్‌సీఐఎస్‌ ప్రకటన ప్రకారం.. అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్‌-1బీ వీసాకు దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది.ఇక, సెప్టెంబరు 21న హెచ్‌1బీ వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు చెల్లింపుల కోసం ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించినట్లు వెల్లడిరచింది. ఎఫ్‌-1 విద్యార్థి వీసా హోల్డర్లు హెచ్‌-1బీకి మారాలనుకునే వారితో పాటు, ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో యూఎస్‌లో ఉన్నవారికి ఈ లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇప్పటికే యూఎస్‌లో ఉద్యోగం చేస్తూ, హెచ్‌1బీ వీసా కలిగి ఉన్నవారికి.. దాని రెన్యూవల్‌, సవరణలు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇక, విదేశాల్లోని ఉద్యోగుల కోసం హెచ్‌-1బీకి దరఖాస్తు చేసుకొనే సంస్థలు కూడా ఈ మినహాయింపులను అభ్యర్థించవచ్చు. కాకపోతే.. అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఆ విదేశీయుడి పాత్ర ఎలా ఉందో వివరించే అధికారిక లేఖ ఆ సంస్థల వద్ద ఉండాలి. అతని హోదాకు కావాల్సిన అర్హతలు కలిగినవారు అమెరికాలో లేరని నిరూపించాలి. ఆ ఉద్యోగికి హెచ్‌-1బీ వీసా పొందేందుకు కలిగిఉన్న అర్హతలు కూడా ఆ సంస్థలు వివరించాలి. హెచ్‌-1బీ వీసాకు అప్లై చేసుకునేటప్పుడే ఈ మినహాయింపు అభ్యర్థనలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు మొత్తాన్ని దరఖాస్తుదారులు ఒకేసారి చెల్లించాల్సి ఉటుంది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురయితే.. అది తిరిగి చెల్లించబడదు. సెప్టెంబరు 21కి ముందు దాఖలైన, ఆమోదం పొందిన వాటికి అంతకుముందున్న నిబంధనలు మాత్రమే అమలవుతాయి. పెంచిన లక్ష డాలర్ల ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

 

రష్యా చమురు కొనుగోళ్లు ఆపకపోతే..
భారత్‌పై భారీ టారిఫ్‌లు చెల్లించాల్సిందే..
` ట్రంప్‌ మరో హెచ్చరిక
` అమెరికాతో ఒప్పందం చేసుకోకుంటే చైనాపై 155 శాతం సుంకాలుంటాయని వెల్లడి
వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్‌ అంగీకరించిందంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీన్ని భారత్‌ తోసిపుచ్చినా.. ట్రంప్‌ మళ్లీ అదే పాట పాడారు. అంతేకాదు.. రష్యా చమురు కొనుగోళ్లు ఆపేంతవరకు న్యూదిల్లీ భారీ టారిఫ్‌లు చెల్లించక తప్పదని మరోసారి హెచ్చరించారు. తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ నాతో స్వయంగా చెప్పారు’’ అని ట్రంప్‌ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను భారత్‌ తిరస్కరించిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఒకవేళ భారత్‌ అలా చెప్పాలనుకుంటే (మోదీ-ట్రంప్‌ ఫోన్‌కాల్‌ను ఉద్దేశిస్తూ) మాత్రం.. వారు భారీస్థాయిలో టారిఫ్‌లు చెల్లిస్తూనే ఉంటారు. కానీ భారత్‌ అలా చేయబోదని నేను అనుకుంటున్నా’’ అని ట్రంప్‌ అన్నారు.శ్వేత సౌధంలో మళ్లీ మాటల యుద్ధం: పుతిన్‌ చెప్పిన దానికి ఒప్పుకోవాలని జెలెన్‌స్కీపై ట్రంప్‌ ఒత్తిడి గతవారం ట్రంప్‌ శ్వేతసౌధంలో మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మోదీతో తాను మాట్లాడానని, మాస్కో నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తానని ప్రధాని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై భారత్‌ స్పందించింది. ట్రంప్‌-మోదీల మధ్య అలాంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ స్పష్టం చేశారు. ఇంధన కొనుగోళ్ల విషయంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడటమే తమకు ముఖ్యమని పునరుద్ఘాటించారు.మరోవైపు, భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ చర్చలకు సంబంధించి ఇరుదేశాల మధ్య వైరుధ్యాలు చాలా వరకు సద్దుమణిగాయని, త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. గతవారం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.
అమెరికాతో ఒప్పందం చేసుకోకుంటే చైనాపై 155 శాతం సుంకాలు: ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనాపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉన్నందునే ఎక్కువ టారిఫ్‌లు చెల్లిస్తోందని పేర్కొన్నారు. చాలా దేశాలు అమెరికాను సద్వినియోగం చేసుకుంటున్నాయన్నారు. చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతోందన్నారు. అమెరికాతో ఒప్పందం చేసుకోకుంటే చైనాపై 155 శాతం సుంకాలు చెల్లించాలన్నారు. నవంబర్‌ 1 నుంచి చైనా పెరిగిన సుంకాలు చెల్లించే అవకాశం ఉందన్నారు. ఇక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో రెండు వారాల్లో దక్షిణ కొరియాలో సమావేశం కానున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

 

 

ట్రంప్‌-పుతిన్‌ల భేటీ వాయిదా!
వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మరోసారి భేటీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే హంగరీలోని బుడాపెస్ట్‌ దీనికి వేదికగా నిర్ణయించారు. అయితే, ఈ సమావేశం వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరుదేశాల అధ్యక్షుల సమావేశానికి ముందు.. అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో సెర్గీ లావ్రోవ్‌ల మధ్య సమావేశం జరగాల్సిఉంది. అయితే, ఇది నిరవధికంగా వాయిదా పడిరదని వైట్‌హౌస్‌ వర్గాలు తెలిపాయి. అధ్యక్షుల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లలో భాగంగా నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు గాను వీరు భేటీ కావాల్సిఉందని రష్యా తెలిపింది. ఈ సమావేశం నిలిచిపోవడానికి గల కారణాలు స్పష్టంగా తెలియలేదు. ఈ క్రమంలోనే రూబియో, లావ్రోవ్‌లు సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. యుద్ధానికి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు.. రష్యా, అమెరికాల మధ్య సహకారానికి సంబంధించి ఈ భేటీ ప్రాముఖ్యతను రూబియో చెప్పినట్లు స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. అయితే, ఉక్రెయిన్‌ వివాదం శాంతియుతంగా పరిష్కరించే విషయంపై వీరి మధ్య బేధాభిప్రాయాలు వెలువడినట్లు వర్గాలు తెలిపాయి.దీంతో ట్రంప్‌- పుతిన్‌లు వచ్చే వారం భేటీకి సంబంధించి రూబియో సిఫార్సు చేసేందుకు అయిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మంత్రులు ఈ వారంలో మళ్లీ మాట్లాడుకునే అవకాశం ఉందన్నారు. ఈ ఫోన్‌ కాల్‌పై క్రెమ్లిన్‌ స్పందించింది. ట్రంప్‌, పుతిన్‌ల భేటీకి సంబంధించి ఇరుదేశాల మంత్రుల మధ్య నిర్మాణాత్మకమైన చర్చలు జరిగాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే అంశంపై ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవి ఫలించడం లేదు. ఇప్పటికే ఇరుదేశాధినేతలతో ట్రంప్‌ మాట్లాడినప్పటికీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఇటీవల పుతిన్‌తో ట్రంప్‌ ఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. ఆ సమయంలోనే హంగరీలో మరోసారి భేటీ అవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ట్రంప్‌ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. జెలెన్‌స్కీతో చర్చలు సానుకూలంగా జరిగాయని ట్రంప్‌ తెలిపారు.

 

భారతీయులను నమ్మకూడదు
` వారిని ఎన్నటికీ మార్చలేం
` ఉన్నత నాయకత్వ స్థానాల్లో శ్వేత జాతీయులు మాత్రమే ఉండాలి
` భారతీయులపై విషం కక్కిన ట్రంప్‌ నామినీ
వాషింగ్టన్‌(జనంసాక్షి):ఆఫీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కౌన్సిల్‌గా ట్రంప్‌ ప్రతిపాదించిన నామినీ పాల్‌ ఇంగ్రాసియా భారతీయులపై విషం కక్కారు. భారతీయులను ఉద్దేశించి పాల్‌ ఇంగ్రాసియా జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. పాల్‌ ఇంగ్రాసియా తోటి రిపబ్లికన్లతో చాటింగ్‌ చేస్తూ భారతీయులను నమ్మకూడదంటూ.. వారిని ఎన్నటికీ మార్చలేమని వ్యాఖ్యానించారు. దేశంలోని ఉన్నత నాయకత్వ స్థానాల్లో శ్వేత జాతీయులు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. నల్ల జాతీయుల విషయంలో తనకు అప్పుడప్పుడు నాజీ తరహా ఆలోచనలు వస్తుంటాయన్నారు. దీనికి సంబంధించిన చాట్‌ లీక్‌ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే భారతీయ-అమెరికన్‌, ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్‌ పార్టీ నేత వివేక్‌ రామస్వామిని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నల్లజాతీయులను ఉద్దేశించి ఆయన చేసిన పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు కూడా లీక్‌ అయ్యాయి. అమెరికా ఎన్నికలకు ముందు 2024 మేలో జార్జియాలో నియమించుకున్న ట్రంప్‌ ప్రచార సిబ్బందిని కేవలం మైనారిటీ ఓటర్లను ఆకర్షించడం కోసమే అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన చాట్స్‌ లీక్‌ అవడంతో పాల్‌ ఇంగ్రాసియాపై పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.