ఛత్తీస్‌గఢ్‌ సీఎం ఎదుట ఆయుధంతో లొంగిపోయిన ఆశన్న

` ఆయనతో పాటు 208మంది సభ్యులు కూడా..
` భారీగా ఆయుధాలు అప్పగింత
` పునరావాసానికి ఏర్పాట్లు చేస్తామన్న ముఖ్యమంత్రి
` మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు
రాయపూర్‌(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్‌ ఆశన్న అలియాస్‌ రూపేష్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 ఆయుధాలు అప్పగించగా.. వీటిల్లో 19 ఏకే`47 రైఫిళ్లు, 17 ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిళ్లు, 23 ఇన్సాస్‌లు, 1 ఇన్సాస్‌ ఎల్‌ఎంజీ, 303 రైఫిళ్లు, 11 బీజీఎల్‌, నాలుగు కార్బైన్‌లు, 41 బోర్‌ షాట్‌గన్‌లు, పిస్తోళ్లు ఉన్నాయి. ఈ లొంగుబాటుపై ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ మాట్లాడారు. ఇది ఛత్తీస్‌గఢ్‌కే కాదు దేశం మొత్తానికి చరిత్రాత్మకమైన రోజు. హింసను వీడి జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని మేం వారిని కోరుతూ వచ్చాం. ఇప్పుడు వారికి నైపుణ్యాలు కల్పించి, పునరావాసానికి ఏర్పాటు చేస్తాం అని వెల్లడిరచారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ అలియాస్‌ అభయ్‌ ఆయుధాలను వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి జనజీవన స్రవంతిలో కలిసిన గంటల వ్యవధిలోనే ఆశన్న లొంగుబాటు ప్రకటన వచ్చింది. ఇద్దరు అగ్రనేతలు పోరాటాన్ని వీడటంతో మావోయిస్టు పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. ఆశన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని నర్సింగాపూర్‌ గ్రామం. నాలుగు దశాబ్దాల క్రితం పీపుల్స్‌వార్‌ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం అప్పటి హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యనభ్యసించారు. కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ)కు నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులోనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్లు పైబడి ఉంటుందని ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. కీలక దాడులకు ఆశన్న వ్యూహకర్త. దండకారణ్య సబ్‌జోనల్‌ బ్యూరో కార్యదర్శిగా రూపేశ్‌ పేరుతో వ్యవహరించిన ఆశన్న.. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిలపై బాంబులు పేల్చి హత్యాయత్నం, 1999లో ఐపీఎస్‌ అధికారి ఉమేశ్‌చంద్ర హత్య, 2000లో నాటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య లాంటి ఘటనలకు నేతృత్వం వహించినట్లు చెబుతారు.