గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
15,130 మంది అభ్యర్థులు హాజరు
శ్రీకాకుళం, జూలై 19 : జిల్లాలో గ్రూపు-2 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం తెలిపారు. ఈ నెల 21,22 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి 15,130 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. పరీక్ష ప్రారంభ సమయానికి గంట ముందు వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. శ్రీకాకుళం పట్టణంలో 37 కేంద్రాలు, ఆమదాలవలసలో 3, పాలకొండ, రాజాం, టెక్కలిలలో రెండేసి పరీక్షా కేంద్రాలను కేటాయించామన్నారు. 12 మంది లైజినింగ్‌ అధికారులు, 46 మంది సహాయ లైజినింగ్‌ అధికారులతో పాటు మరో 12 మంది డిప్యూటీ తహశిల్దార్‌ క్యాడర్‌ ఉద్యోగులను పర్యవేక్షణాధికారులుగా నియమించామన్నారు. 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తొలిరోజు పరీక్ష ఉంటుందని, 22వ తేదీన ఉదయం పది గంటలనుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి పరీక్షకు సంబంధించిన సామగ్రి చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.