కాలుష్యంతో బాధపడుతున్నా కనికరం లేదా?

` కనీసం ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేరా?
` కేంద్రంపై ఢల్లీి హైకోర్టు ఆగ్రహం
న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ.. ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై 18శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వీటిపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.ఎయిర్‌ ప్యూరిఫైయర్లను వైద్య పరికరంగా పరిగణించి.. వాటిని 5శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలంటూ దిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘‘మనం రోజుకు 21వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
మూడు రోజుల్లోనే అలర్జీ వచ్చింది: నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
ఈ పిటిషన్‌పై స్పందించేందుకు సమయం ఇవ్వాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘వాయు కాలుష్యం వల్ల వేలాది మంది చనిపోతున్నారు. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం ఎయిర్‌ ప్యూరిఫైయర్లనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా. ఇలాంటి ఎయిర్‌ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు చేపట్టలేరా? ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై తక్షణం మినహాయింపులు ఇవ్వలేరా?’’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై ఈ రోజే తమ స్పందన తెలియజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.