రాజస్థాన్ రైతన్న తిరుగుబాటుకు ‘ఇథనాల్’ ఫ్యాక్టరీ రద్దు..!
` దిగొచ్చిన సర్కారు.. తలొగ్గిన కంపెనీ యాజమాన్యం
` రాజస్థాన్‌లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహ జ్వాలనిర్మాణం
` ఆపేస్తానమి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ
` అన్ని కేసులు ఉపసంహరించేదాకా పోరాటాలు ఉంటాయన్న రైతుల సంఘాలు
` ఇంటర్నెట్ సేవలు బంద్ చేసినా విజయం సాధించిన ప్రజానీకం
రాజస్థాన్ రైతులు గెలిచారు. సంఘటితంగా ఉంటే ఏదైనా సాధ్యమేనని చాటారు. తమ జీవితాలను కాపాడుకునేందుకు ఒక్కొక్కరుగా నడుంబిగించిన అన్నదాతలు.. మహమ్మారి భూతాన్ని కలిసికట్టుగా తరిమికొట్టారు. జీవితాలు ఛిద్రం కాకుండా కాపాడుకున్నారు. మనిషి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చే ఇథనాల్ భూతంపై దేశవ్యాప్తంగా పల్లెలు తిరగబడుతున్న విషయం విదితమే. గత రెండువారాల కింద ఉవ్వెత్తున ప్రజాగ్రహం ఎగిసిపడటంతో ఇథనాల్ ప్రతిపాదిత ప్రాంతం రణరంగాన్ని తలపించింది. పోలీసులు, రైతులకు మధ్య తీవ్ర ఘర్షణ.. తదనంతరమూ రైతులు, కిసాన్ సంఘాలు పోరాటం ఉధృతం చేయడంతో ప్రభుత్వం యంత్రాంగం స్పందించక తప్పలేదు. ఫ్యాక్టరీ యాజమాన్యమూ తలొగ్గక తప్పలేదు. చివరకు.. ఫ్యాక్టరీకి అక్కడి ప్రాంతం నుంచి రద్దు చేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వానికి లేఖ కూడా పంపడంతో రైతులు సంబరాల్లో మునిగిపోయారు.
జైపూర్, డిసెంబర్ 24 (జనంసాక్షి) :ప్రజల అనుమతి లేకుండా రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా, తిబ్బీ ప్రాంతంలోని రథీఖేడా గ్రామంలో డ్యూన్ ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 450 కోట్ల రూపాయలతో గ్రెయిన్ ఆధారిత 40 మెగావాట్ ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకుంది. రెండేళ్లుగా స్థానిక రైతులు, గ్రావిూణులు ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 11న తిబ్బీలో ‘మహాపంచాయత్’ (పెద్ద గ్రామ సభ) నిర్వహించగా.. వేలాది మంది రైతులు (రాజస్థాన్, పంజాబ్, హర్యానా నుంచి) ట్రాక్టర్లతో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. ఫ్యాక్టరీ గోడలను కూల్చి, అక్కడ ఏర్పాటుచేసిన కార్యాలయానికి నిప్పంటించారు. జేసీబీలు సహా పలు పోలీసు వాహనాలకు, ఫ్యాక్టరీ నిర్వాహకుల కార్లకు కూడా నిప్పంటించారు. దీంతో లాఠీచార్జి చేసిన పోలీసులు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోగా.. వేలాది మంది గుమిగూడటం, భారీగా పోలీసు బలగాలు రావడంతో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రూపిందర్ సింగ్ కున్నర్‌తో పాటు 40 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 107 మందిపై కేసులు నమోదు. తిబ్బీ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. మార్కెట్లు మూసివేశారు. ఫ్యాక్టరీ సవిూపంలో 30 కుటుంబాలు భయంతో ఇళ్లు వదిలి వెళ్లాయి.
అడ్డదారిని అడ్డుకున్న ప్రజలు
ఫ్యాక్టరీ ద్వారా వెయ్యి మంది వరకు ఉపాధి దొరుకుతుందని ప్రకటించినా.. పర్యావరణ క్లియరెన్స్ పత్రాలు, స్థానికుల అనుమతి లేకుండా ఫ్యాక్టరీ నిర్మించతలపెట్టారు. దీంతో నిరసనలు పెల్లుబుకడంతో రైతుల బృందంతో అధికారులు చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 17న మహాపంచాయత్‌లో ఎంఓయూ రద్దు చేయాలని రైతులు 20 రోజుల అల్టిమేటమ్ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం కంపెనీ మేనేజర్ ప్రకటన చేస్తూ.. రాజస్థాన్ నుంచి ఇతర ప్రాంతానికి తరలించేందుకు నిర్ణయించామని తెలిపారు. అయితే ఇది అధికారికంగా వెలువడకపోయినప్పటికీ.. కంపెనీ యాజమాన్యమే ప్రకటన చేయడం, సీఎస్‌కు కూడా లేఖ రాయడంతో రైతుల విజయంగా రైతు సంఘాలు భావిస్తున్నాయి. కేసులన్నీ ఉపసంహరించేదాకా ఈ పోరాటాలు కొనసాగుతాయని కిసాన్ సంఘాలు ప్రకటించాయి.
ఇది ప్రజా విజయం : కిసాన్ సభ
కిసాన్ సభ జిల్లా కార్యదర్శి, టిబ్బి ఉద్యమ స్థానికుడు మాంగేజ్ చౌదరి మాట్లాడుతూ..ఈ విజయం టిబ్బి ప్రజలు, రైతులు, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని అన్నారు. నిరసన స్థాయిని చూసి, ఫ్యాక్టరీ యాజమాన్యం వెనక్కి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూసింది. కానీ రైతులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుంది.
రాష్ట్రంలో నిర్మించబోం : ఫ్యాక్టరీ మేనేజర్ రాజస్థాన్ వెలుపల ప్లాంట్‌ను తరలించడం గురించి ఫ్యాక్టరీ యాజమాన్యం, పరిపాలన నుండి ఎటువంటి అధికారిక నోటిఫికేషన్ లేదా లేఖ జారీ కాలేదు. కానీ ఫ్యాక్టరీ మేనేజర్ జెపి శర్మ మాట్లాడుతూ.. ఈ ప్లాంట్‌ను రాష్ట్రంలో నిర్మించబోమని ధృవీకరించారు. టిబ్బిలోని రతిఖేడ ప్రాంతంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయకూడదనే నిర్ణయాన్ని తెలిపారు. ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపినట్లు వెల్లడిరచారు. అదేవిధంగా హనుమాన్‌ఘడ్ జిల్లా కలెక్టర్‌కు కూడా పంపినట్లు చెప్పారు.



