రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులని విడదీయడం సరికాదు

హైదరాబాద్ (జనంసాక్షి) : వర్కింగ్ జర్నలిస్టుల మధ్య అధికారులు చిచ్చు పెట్టొద్దని, అక్రిడిటేషన్ల జారీలో వివక్ష చూపొద్దని డెస్క్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు తీసేసి, మీడియా కార్డులు ఇస్తామనడం సరికాదన్నారు. బుధవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ’ (డీజేఎఫ్ టీ) పేరిట నూతన సంఘం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో జీవో 252పై జర్నలిస్టులు చర్చించారు. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు కలిస్తేనే వార్త అవుతుందని.. అట్లంటప్పుడు ఈ విభజన ఎందుకని డీజేఎఫ్టీ నేతలు ప్రశ్నించారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే తీరును మానుకోవాలన్నారు. మీడియా కార్డుల పేరుతో డెస్క్ జర్నలిస్టులను సెకండ్ గ్రేడ్ సిటిజన్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న తమకు.. అక్రిడిటేషన్ ఇవ్వకపోవడం అంటే కష్టపడి సాధించుకున్న హక్కును గుంజుకోవడమేనని మండిపడ్డారు. కేవలం సంక్షేమ పథకాలు, ఇండ్ల స్థలాల కేటాయింపులో కోత పెట్టేందుకే ఈ స్క్రీనింగ్ చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బస్ పాసుల విషయంలోనూ ఐఆర్ పీఆర్ ఆఫీసర్లు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో హెచ్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ్ కుమార్, జగదీశ్, టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి నవీన్ డబ్ల్యూఐజే రాష్ట్ర సెక్రటరీ రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొని మద్దుతు ప్రకటించారు.
కొత్త కార్యవర్గం ఇదే..
డీజేఎఫ్ టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాదిని ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా మస్తాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా కేవీ రాజారామ్, జాయింట్ సెక్రెటరీగా విజయ, ట్రెజరర్గా నిస్సార్ బాధ్యతలు స్వీకరించారు.
డిమాండ్లు – తీర్మానాలు
డెస్క్ జర్నలిస్టులకు ఎప్పటిలాగే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలి. వర్కింగ్ జర్నలిస్టులను వేరు చేసేలా ఉన్న జీవో 252 ను వెంటనే సవరించాలి. అక్రిడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు చోటు కల్పించాలి. రాష్ట్రంలో ఐ అండ్ పీఆర్ కమిషనర్ను, జిల్లాల్లో కలెక్టర్లను కలిసి మెమోరాండం ఇవ్వాలి. హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డెస్క్ జర్నలిస్టులందరినీ ఏకం చేసి, హక్కుల సాధన కోసం ఇతర సంఘాలతో కలిసి పోరాడాలి.



