బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం
` ‘బ్లూ బర్డ్ బ్లాక్`2’శాటిలైట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ‘ఎల్‌వీఎం3` ఎం6’
` అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాం: ఇస్రో చైర్మన్ నారాయణన్
` ఇస్రో ప్రయోగంతో బలమైన పునాదులు
` అంతరిక్షంలో ప్రపంచసహకారంతో ముందుడుగు
` ప్రధాని మోడీ అభినందనలు..
తిరుపతి(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో మరో మైలురాయిని చేరింది. శ్రీహరి కోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ శాటిలైట్ బ్లూ బర్డ్ బ్లాక్`2ను ఈ రాకెట్ విజయవంతంగా నింగిలోకి తీసుకెళ్లింది. తొలిసారిగా ఇంతటి భారీ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపింది. కేవలం 15 నిమిషాల్లోనే బ్లూబర్డ్ ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో ఈ ప్రయోగం నిర్వహించింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా 4.జి, 5జి సేవలను బ్లూ బార్డ్ బ్లాక్`2 అందించనుంది. ఎల్‌వీఎం 3 రాకెట్ సిరీస్‌లో ఇది 9వ ప్రయోగం. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ.. బాహుబలి ప్రయోగం విజయవంతమైందన్నారు. ఎల్‌వీఎంప్రయోగాల్లో సంపూర్ణ విజయాలు సాధిస్తున్నా మని తెలిపారు. అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం చేశామన్నారు. అమెరికన్ కస్టమర్ కోసం ప్రయోగం చేపట్టామని చెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటన్నారు. 34 దేశాలకు ఇస్రో సేవలందిస్తోందని అన్నారు. గగన్‌యాన్ కోసం ఈ ప్రయోగం మరింత ఆత్మవిశ్వాసం కలిగిస్తోందని తెలిపారు. ఇస్రోపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ తెలిపారు.ఈ ప్రయోగం ఇస్రోకి చారిత్రాత్మకమైన విజయమన్నారు. వాణిజ్య ప్రయోగాలలో మరోసారి సత్తా చాటామని తెలిపారు. అత్యంత కీలకమైన ఈ ప్రయోగం 52 రోజుల్లోనే సిద్ధం చేసి ప్రయోగం చేపట్టామని చెప్పారు. మన శాస్త్రవేత్తల సమిష్టి విజయం.. ఎల్‌వీఎం 3 ` ఎం 6 రాకెట్ ప్రయోగం అని చెప్పుకొచ్చారు. ఈ ప్రయోగ విజయం తమకు అత్యంత ధైర్యాన్ని కల్పించిందన్నారు. ఎల్‌వీఎం ప్రయోగాలలో ఈ ప్రయోగం మూడవ వాణిజ్య ప్రయోగమని వెల్లడిరచారు. ఎల్‌వీఎం రాకెట్లనే చంద్రయాన్ 4, 5కు ఉపయోగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మానవ రహిత ప్రయోగాలని చేపట్టబోతున్నామని ప్రకటించారు. వాణిజ్య ప్రయోగ ఒప్పందాలు పూర్తయిన వెంటనే వరస వాణిజ్య ప్రయోగాలని చేపడుతున్నామన్నారు. భవిష్యత్తులో నావిగేషన్ ప్రయోగాలు, అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ పేర్కొన్నారు.
ఇస్రో ప్రయోగంతో బలమైన పునాదులు
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ప్రయోగించిన బాహుబి రాకెట్ ఎల్‌వీఎం3` ఎం6 ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్ 2 ను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై దేశంలోని పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాబబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తమ ఎక్స్ ఖాతాల వేదికగా వేర్వేరుగా స్పందించారు. ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారతదేశ యువత శక్తితో.. మన అంతరిక్ష రంగం మరింత అభివృద్ధి చెందుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ప్రభావ వంతంగా మారుతోందని ఆయన ఆకాంక్షించారు. ఎల్‌వీఎమ్ 3 నమ్మకమైన హెవీ లిప్ట్ పనితీరును కనబరుస్తుందన్నారు. గగన్‌యాన్ వంటి భవిష్యత్ మిషన్ల కోసం బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. అలాగే వాణిజ్య ప్రయోగ సేవలను సైతం విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇది భవిష్యత్తు తరాల సామర్థ్యంతోపాటు స్వావలంబను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎమ్3` ఎమ్6ను బుధవారం ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ఇస్రో బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. యూఎస్ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 మోసుకెళ్లి.. అందుకు నిర్దేశిరచిన కక్ష్యలో ఈ ఉపగ్రహం ఉంచిందన్నారు. భారత్ నేలపై నుంచి ఇప్పటి వరకు అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించ లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాజాగా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా మన దేశ వాణిజ్య అంతరిక్ష సామర్థ్యం, ప్రపంచ ప్రయోగ భాగస్వామిగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ అద్భుతమైన మిషన్ విజయానికి దోహదపడిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు ఇలా ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.బాహుబలి రాకెట్ అని పిలువబడే ఎల్‌వీఎమ్3 ` ఎమ్ రాకెట్‌ను శ్రీహరికోట నుంచి ఈ రోజు విజయవంతంగా ప్రయోగించినందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని శాస్త్రవేత్తలు, సిబ్బందికి రాష్ట్ర ఐటీ విద్య శాఖ మంత్రి లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతదేశ వాణిజ్య ప్రయోగ సామర్థ్యాలను ప్రపంచం ఎదుట ప్రదర్శించడానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.


