ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలి పట్ట ఇంత అన్యాయమా?

` నిందితులకు బెయిల్‌ రావడం,బాధితులను నేరస్థులుగా చూడటం ఏ రకమైన న్యాయం?
` ఇలాంటి అమానవీయ ఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారుతున్నాం :రాహుల్‌ గాంధీ
` సుప్రీంలో సవాలు చేస్తాం
` ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):ఉన్నావ్‌ అత్యాచార కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు అనుభవిస్తున్న కుల్దీప్‌ సెంగర్‌ శిక్షను దిల్లీ న్యాయస్థానం నిలిపివేయడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాలు చేస్తామని పేర్కొంది. సెంగర్‌ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ బాధితురాలు, ఆమె తల్లి నిరసన చేస్తున్న క్రమంలో వారితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. పోలీసులు బాధితురాలిని లాక్కెళ్తున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. పోలీసుల తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా సామాజిక కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఉన్నావ్‌ బాధితురాలి నిరసనకు సంబంధించిన ఓ వీడియోపై స్పందించిన రాహుల్‌ గాంధీ.. తనకు అన్యాయం జరిగిందంటూ నిరసన చేస్తున్న ఓ అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరించడం సమంజసమేనా..?న్యాయం కోసం గళం వినిపించడమే ఆమె చేసిన తప్పా..? అని ప్రశ్నించారు. అత్యాచార నిందితులకు బెయిల్‌ రావడం, బాధితులను నేరస్థులుగా చూడటం ఏ రకమైన న్యాయమని నిలదీశారు. ఇటువంటి అమానవీయ సంఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారుతున్నామన్నారు.
సుప్రీంలో సవాలు చేస్తాం..
తమ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, సాక్షుల భద్రతను ఇప్పటికే ఉపసంహరించుకున్నారని.. తాజా పరిణామాలు తమ భయాలను మరింత పెంచాయని ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు విూడియాతో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో దోషికి ఇలా బెయిల్‌ వస్తే.. దేశ మహిళలు సురక్షితంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సెంగర్‌కు బెయిల్‌ లభించడం తమకు మరణం కంటే తక్కువేం కాదన్నారు. డబ్బు లేనివారికి ఎప్పుడు ఓటమేననే విషయాన్ని ఈ పరిణామం నిరూపిస్తోందని విలపించారు.
భాజపా విధానాలతో చిరు వ్యాపారులకు దెబ్బ : రాహుల్‌ గాంధీ
భాజపా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చిన్న వ్యాపారాలు చేసేవారిని.. ముఖ్యంగా వైశ్య వర్గాన్ని దెబ్బతీస్తున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆ వర్గానికి తాను మద్దతుగా ఉంటానని హావిూ ఇచ్చారు. ఈ సందర్భంగా భాజపా మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వైశ్య వర్గానికి చెందిన వ్యాపారులతో రాహుల్‌ భేటీ అయ్యి మాట్లాడారు. చర్చల అనంతరం వారి సమస్యలపై రాహుల్‌ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ‘మా వ్యాపారం పతనానికి దగ్గరగా ఉంది.. అంటూ వైశ్య సమాజం నుంచి వచ్చిన ఆవేదన నన్ను తీవ్రంగా కలచివేసింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడిన సమాజం.. నేడు ఇలా నిరాశలో కూరుకుపోవడం ఓ హెచ్చరిక లాంటిది. గుత్తాధిపత్య సంస్థలకు స్వేచ్ఛనిచ్చి.. చిన్న, మధ్యతరహా వ్యాపారులపై అధికారం, జీఎస్టీ వంటి విధానాలతో ప్రభుత్వం భారం మోపుతోంది. ఇది కేవలం విధాన వైఫల్యం మాత్రమే కాదు. ఉత్పత్తి, ఉపాధితో పాటు భారత భవిష్యత్తు పైనా ప్రత్యక్ష దాడి’ అని ఆరోపించారు. భాజపా ప్రభుత్వ మనస్తత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని రాహుల్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో దేశ వాణిజ్యానికి వెన్నెముక అయిన వైశ్య వర్గానికి తాను మద్దతుగా నిలబడతానన్నారు.