అగ్రిగోల్డ్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌

– సీతారామారావును అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు
విజయవాడ, మే22(జ‌నం సాక్షి) : అగ్రిగోల్డ్‌ కేసులో కీలక నిందితుడైన అవ్వా సీతారామారావును సీఐడీ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. సీతారాం గతంలో అగ్రిగోల్డ్‌ కు డైరక్టర్‌గా వ్యవహరించాడు. కంపెనీ లావాదేవీలను తెరవెనుక నుండి నడిపించేవాడు. అగ్రిగోల్డ్‌ పై కేసు నమోదు తర్వాత సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ముందస్తు బెయిల్‌ కోసం ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ను సంప్రదించాడు. అయితే హైకోర్టు బెయిల్‌ నిరాకరించటంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న తనవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. అగ్రిగోల్డ్‌ సంస్థలను వేలంలో కొనేందుకు ముందుకొచ్చిన ఎస్సెల్‌ గ్రూప్‌ సంస్థలను సీతారామారావు ప్రభావితం చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సీఐడి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సీతారాంను ఎట్టకేలకు సీఐడీ పోలీసులు గూడ్‌గావ్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితుడ్ని స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్‌ వారెంట్‌పై బుధవారం ఉదయం విజయవాడకు తీసుకువచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్‌  అసలు ఆస్తులెంత? లావాదేవీలు ఎలా జరిగాయి? అనే విషయాలపై సీతారామారావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే అగ్రిగోల్డ్‌ చైర్మన్‌ అవ్వా వెంకట రామారావు సహా తొమ్మిదిమంది అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. కాగా పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్‌ సంస్థలో డిపాజిట్‌ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.