అడవుల్లో ఎర్రకూలీల రాజభోగం

తిష్టవేసి నింపాదిగా దుంగల తరలింపు 
తిరుపతి,మే21(జ‌నం సాక్షి): ఎర్రచందనం కూలీలకు స్మగ్లర్లు అడవుల్లో అన్ని సదుపాయాలను కల్పించి వారితో దుంగలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టుబడ్డప్పుడు వంటసామాన్లు లభించగా, దీనికి తోడు మందు సహా అడవి జంతువులను వేటాడి చంపి తింటున్నట్లు గుర్తించారు. గట్టి నిఘా పెట్టినా వారు అడవుల్లోకి రాకుండా ఉండలేకపోతున్నారు.  అడవుల్లో నెలల తరబడి నివసిస్తూ గుట్టుచప్పుడు కాకుండా తమ పని చక్కబెడుతున్నట్లు టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీలను పట్టుకునే క్రమంలో సూపర్‌ మార్కెట్లను తలదన్నేలా కూలీల ఆహార నిల్వలు బయటపడుతూనే ఉన్నాయి. కూలీలు పేరుకే అడవిలో ఉన్నా రాజభోగాలను అనుభవిస్తున్నారు. నీటి సదుపాయం ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ అన్ని వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలతో పాటు నిత్యావసర సరుకులను వెంట తీసుకెళ్తున్నారు. ఒకవేళ వెజిటేరియన్‌ ఫుడ్‌ బోర్‌ కొడితే అడవుల్లోని జింకలు, దుప్పిలు, అడవి పందులను వేటాడి వాటి మాంసంతో విందులు చేసుకుంటున్నారు. అలాగే మద్యానికి కూడా లోటు లేకుండా బీర్‌ బాటిళ్లు, వైన్‌ సీసాలను వెంట తీసుకెళ్తున్నారు. బీడీలు, సిగరెట్లకు కూడా లోటు లేకుండా చూసుకుంటున్నారు. వీటితో పాటు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందుగానే పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్‌ లెట్స్‌ను వెంట పెట్టుకుంటున్నారు.  కూలీలను  పట్టుకునేందుకు టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు నానా ఇబ్బందులు పడుతుంటే… వారు మాత్రం అడవుల్లో లోపలికి చొచ్చుకుపోయి ఎంజాయ్‌ చేస్తున్నారు. అడవి జంతువులను వేటాడి  మాంసంతో విందులు చేసుకుంటూ మందేసి చిందేస్తున్నారు. దీంతో ఇటు అటవీ సంపద పోతుందన్న భయం ఒకవైపు అడవుల నరకివేత మరోవైపు వెన్నాడుతోంది.  వారిని పట్టుకునేందుకు వెళ్లే కూంబింగ్‌ పార్టీలకు ఇలాంటి ఘటనలు తారసపడుతున్నాయి. అడవిమాంసానికి తోడు కూలీలు మద్యం తాగుతూ ఎంచక్కా ఎర్రచందనం చెట్లను నరికి హద్దులు దాటించేస్తున్నారు.  బీడీల దగ్గర నుంచి సిగరెట్ల వరకు వాటర్‌ బాటిళ్ల దగ్గర నుంచి మద్యం బాటిళ్ల వరకు… బియ్యం దగ్గర నుంచి పప్పు దినుసుల వరకు… జండూ బాం దగ్గర నుంచి పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్‌ లెట్స్‌ వరకు ఇలా  అన్ని రకాల వారు తమకు కావాల్సిన పదార్థాలను సమకూర్చుకుని పోతున్నారు. ఎర్రచందనం కూలీలను పట్టుకునేందుకు వెడుతున్న కూంబింగ్‌ పార్టీలు మాత్రం తాగేందుకు కూడా నీళ్లు దొరక్క దాహంతో అలమటిస్తుంటే… కూలీలు మాత్రం తిండికి, తాగుడుకు లోటు లేకుండా ఎంజాయ్‌ చేస్తున్నారు.  తమకు అనువుగా ఉన్న సమయంలో పోలీసలు కళ్లుగప్పి దుంగలు తరలిస్తున్నారు. దీనికి స్థానికులను వాడుకుంటున్నారని సమాచారం. వారికి కొంత ముట్టచెప్పడం ద్వారా వారి నుంచే సరుకులు తెప్పించుకుంటున్నారని సమాచారం. దీంతో స్థానికులకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు.