అధికారం కోసమే అఫ్జల్‌ ఉరి

మూడు వేల మందిని పొట్టన పెట్టుకున్న మోడీ
ప్రధాని కావాలని ఎట్లంటరు : వరవరరావు
ఉరిశిక్షకు వ్యతిరేకంగా ధర్నా, అరెస్టు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (జనంసాక్షి) :
యూపీఏ ప్రభుత్వం అధికారమే లక్ష్యంగా అప్జల్‌గురును ఉరితీసిందని విరసం మాజీ అధ్యక్షుడు వరవరరావు అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన తెలంగాణ విద్యావంతుల వేదిక గ్రేటర్‌ హైదరాబాద్‌ మూడో వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఉద్యమకారుడిని ఉరితీసిందని ఆయన వ్యాఖ్యానించారు. మరణ శిక్ష రద్దు చేయాలని ప్రపంచ దేశాలన్ని కోరుతుంటే భారతదేశం మాత్రం ఒకరి తర్వాత ఒకరి ఉరితీస్తూ పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు రాజ్య హింసను ప్రోత్సహిస్తూ తమ బిడ్డలనే
పొట్టనబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు వేల మందిని పొట్టన బెట్టుకున్న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని దేశప్రధాని కావాలని కోరుకుంటూ, సంబంధం లేని వారిని ఉగ్రవాదులని ఉరితీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధువులు, సన్యాసులు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం కంటే దౌర్భాగ్యం లేదన్నారు. బీజేపీతో పోటీపడటానికే సోనియాగాంధీ అజ్మల్‌ కసబ్‌, అప్జల్‌గురులను ఉరితీయించిందని పేర్కొన్నారు. నిజాం ప్రభుత్వంలో కన్నా, నక్సలైట్‌ ఉద్యమంలో కన్నా మోడీ అత్యధిక మందిని పొట్టన బెట్టుకున్నాడని తెలిపారు. ఆయన వ్యాఖ్యలపై సమావేశంలో పాల్గొన్న కొందరు నిరసన తెలిపారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న వరవరరావు పౌరహక్కుల సంఘాల నాయకులతో కలిసి ఉరిశిక్ష అమలుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వాని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని వీవీతో పాటు పౌర హక్కుల సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

తాజావార్తలు