అనంత కరవును పారదోలే చర్యలు
కాలువలపై సౌర విద్యుత్ పలకలు
అనంతపురం,మే21(జనం సాక్షి): అనంతపురం జిల్లా కరువును పారదోలేందుకు అనేక పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రధానంగా కరవు నివరాణకు పంటకుంటలు, మొక్కలు నాటడం, వాననీటి సంరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు. దీనికితోడు నిరంతర విద్యుత్ దిశగా కృషి జరుగుతోందన్నారు. వివిధ పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకున్నామని, దీంతో నిరుద్యోగానికి ఢోకా ఉండబోదన్నారు. సోలార్, విండ్ విద్యుదుత్పత్తికి అనువైన ప్రాంతంగా ఉన్నందున సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు జరిగిందన్నారు. సోలార్ ఎనర్జీని ప్రత్యామ్నాయంగా గుర్తించామని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1,350మెగావాట్ల మేర విండ్ పవర్ ఉత్పత్తి అవుతుండగా.. 550 మెగావాట్ల మేర సౌర విద్యుదుత్పత్తి జరుగుతోంది. కేవలం ఎన్.పి కుంటలోనే 250 మెగావాట్ల సౌర విద్యుత్తు అందుబాటులో ఉంది. ఇంకా తాడిపత్రి, అమరాపురం, హిందూపురం, తాడిమర్రి తదితర ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులు ఉన్నాయి. తాజాగా జిల్లాలో మరో కొత్త సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. కాలువలపై పలకలు ఏర్పాటు చేయడం ద్వారా దీనిని చేపట్టబోతున్నారు. దేశంలో గుజరాత్‌తోపాటు వివిధచోట్ల ఇప్పటి వరకు పంట కాల్వలపై సౌర ఫలకలు ఏర్పాటు చేసి, విద్యుదుత్పత్తి చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇలాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. తొలిసారిగా అనంతలోనే దీనిని ఏర్పాటు చేయడానికి అధ్యయనం చేస్తున్నారు. టీఏబీఆర్ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 11 టీఎంసీలు కాగా, తాగునీటి అవసరాల కోసం కనీసం 2 నుంచి 2.5 టీఎంసీల నీటిని ఇందులో నిల్వ ఉంచుతారు. ఈ నీటిపై కొత్తగా ప్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయనున్నారు. నీటిపైన కొంత భాగంలో ప్లాట్‌ఫామ్ నిర్మించి, దానిపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారు. ప్లాట్‌ఫామ్ ఎత్తు పెంపు, తగ్గింపునకు వీలుండేలా ఏర్పాటు చేస్తారు. జలాశయంలో నీరు క్కువగా ఉన్నపుడు దానిని కిందకు దించుతారు. జలాశయంలో ఎక్కువ నీరు వచ్చి చేరితే క్రమంగా దానినిపైకి తీసుకెళ్తారు. ప్రాజెక్టుతో సౌర విద్యుత్తు ఉత్పత్తి అవ్వడమే కాకుండా, దాని దిగువన ఉండే జలాశయ నీరు
ఎండ వేడికి ఆవిరి కాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఏదైనా జలాశయంలో 20 శాతం నీరు ఎండ వేడికి ఆవిరైపోతూ ఉంటుంది. ఈ జలాశయంలో ఏటా దాదాపు కనీసం 0.25 టీఎంసీల నీరు ఆవిరవుతుంటుంది. తాజాగా కొత్త సౌర ప్రాజెక్టు ద్వారా కొంత వరకు అయినా నీటి ఆవిరి తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జలశయంపై ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడంతో భూ సేకరణ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. సోలార్ ఎనర్జీ సొసైటీ సహకారంతో కోల్‌కతాకు చెందిన సంస్థ స్టడీ చేస్తోంది. ఇప్పటికే సంస్థ ప్రతినిధులు జలాశయాన్ని పరిశీలించారు. దీంతో ప్రయోజనాలు అనేకంగా ఉన్నాయని అధికారులు అన్నారు. కరవుకు నిలయమైన అనంతలో నీటిసంరక్షణ పనులు ఉద్యమంలా చేపట్టాల్లసి ఉందని మంత్రి కాల్వ అన్నారు. ప్రజలు మేలుకోకుంటే భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందని హెచ్చరించారు. సకల జీవకోటికి అవసరమైన నీటి కోసం యుద్ధాలు రాకుండా నీటిని పొదుపు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు మేలుకొని నీటి సంరక్షణ పనులు చేపట్టాలని పిలుపునిచ్చారు. నాబార్డు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్ష గ్రామాల్లో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.