అనంత నీటి కష్టాలపై చిత్తశుద్ది లేదు: సిపిఐ 

అనంతపురం,మే19(జ‌నం సాక్షి): అనంత కరువుపై వామపక్షాలు రెండు రోజలు చేపట్టిన ఆందోళన కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరువు నుంచి అన్నదాతలను ఆదుకునేందుకు కూడా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. తాము చేసిన ఆందోళనలను అడ్డుకోవడంపై ఉన్న శ్రద్ద రైతులపై లేదన్నారు. ప్రజలకు మంచి నీటి కష్టాలను తీర్చేందుకు అధికారులు చొరవ చూపకపోవడంతో స్థానికంగా ఇబ్బందులు తప్పడంలేదు. తాజాగా ప్రాజెక్టుకు సంబంధించిన మోటర్‌ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నీటి సరఫరా ఒక్కసారిగా ఆగిపోంది.  అధికారుల నిర్లక్ష్యంతో త్రాగునీటి కోసం అనంతపురం జిల్లా వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. శ్రీరామిరెడ్డి మంచినీటి పథకంపై మొదటి నుంచి సమస్యలు ఎదుర్కొంటోంది. అసలే మండు వేసవి కావడం అందులోనూ తాగడానికి నీళ్లు లేకపోవడంతో జనాలు అల్లాడిపోతున్నారు.  బోర్లు ఎండిపోయి పూర్తిస్థాయిలో ప్రభుత్వం సరఫరా చేసే మంచినీటిపై ఆధారపడ్డ ప్రజలకు బిందెనీళ్లుకూడా దొరకని దుస్థితి ఉందని జగదీశ్వర్‌ అన్నారు. 800 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలకు నీళ్లందించే శ్రీరామిరెడ్డి మంచినీటి ప్రాజెక్టుపై అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వహిస్తుండటంతోనే ఇంతటి సమస్య వచ్చిపడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి తాగునీటి కష్టాలను తీర్చే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమస్లయపై తక్షణ చర్యలు తీసుకోకుంటే ప్రత్యో ఆందోళనకు దిగుతామని సిపిఐ హెచ్చరించింది.