అమిత్‌షాపై విసిరిన రాళ్లే..
టీడీపీ సమాధికి పునాది రాళ్లు
– టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరగాలి
– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు
అమరావతి, మే24(జనం సాక్షి) : అలిపిరిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్‌పై వేసిన రాళ్లే…టీడీపీ సమాధికి పునాదిరాళ్లు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పేరాల చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘టీటీడీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలపడం చంద్రబాబు పతనానికి నాంది అవుతుంది. మాయమైన పింక్ డైమండ్ 50 రూపాయల విలువ కూడా ఉండదని డాలర్ శేషాద్రి ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. పదవీ విరమణ చేసిన డాలర్ శేషాద్రి లాంటి వారిచేత మాత్రమే వ్యవస్థ నడపటం మంచిది కాదన్నారు. ఒక విలువైన వజ్రం ముర్పులు చేయబడినట్లు రమణకుమార్ నివేదికలో ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నివేదిక ప్రజల ముందుంచాలన్నారు. శ్రీకృష్ణదేవరాయులు తిరుమల సందర్శనలో దేవుడికి సమర్పించిన విలువైన కానుకలు ఇచ్చారని పురావస్తు శాఖలో వివరాలు ఉన్నాయన్నారు. రాజులు ఇచ్చిన కానుకులు, భూముల వివరాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయన్నారు. అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండటం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలని, డూప్లికేట్, గిల్ట్, అనుకరణ నగలను పెట్టి స్వామివారి ఒరిజినల్ ఆభరణాలు మాయం చేస్తున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పేర్కొన్నారు. పోటును 12 రోజులు ఎలా మూసేస్తారని ప్రశ్నించారు. టీటీడీ వ్యవహారంలో సీబీఐ విచారణ జరగాలని, ఆస్తులు, నగలు దేశాలు మారాయని ఆరోపణ ఉంది కాబట్టే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు.