ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కష్టమే
సీట్ల కోసం ఏజెన్సీల కుస్తీ
విజయవాడ,మే19(జనం సాక్షి): ఈ యేడు రాష్ట్రంలో లక్షా 50వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్టూడెంట్స్ భర్తీ కష్టమే అని నిపుణులు అంటున్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ ఇంజనీరింగ్ వైపు తక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం ఈ దఫా విద్యార్థుల కోసం వెతుకులాడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పటికే అనేక ఏజెన్సీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో తక్కువ ఫీజులతో చేర్పించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇప్పటికే మేళాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేపట్టాయి. విజయవాడలో ఇటీవల జరిగిన మేళాలే ఇందుకు నిర్శనం. అందమైన బ్రోచర్లతో ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకోసం ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్ల కోసం ఆయా ఏజెన్సీలపై ఆధారపడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్ల కంటే ఈ సంవత్సరం ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య తక్కువ కావడంతో ఈ సమస్య వచ్చి పడింది. ఇంజనీరింగ్‌కు రానురాను డిమాండ్ తగ్గుతోందని క్యాబ్ కన్సల్టెన్సీ తెలిపింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు త్వరలో కౌన్సిలింగ్ పక్రియ ప్రారంభం కానుంది. ఎంసెట్ ఫలితాలు వచ్చాక సందడి మొదలవుతుంది. రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు గతంలో ఇబ్బడిముబ్బడిగా అనుమతులివ్వగా చాలా కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఆయా ప్రభుత్వాలు తగిన సంఖ్యలో రాష్ట్రానికి మంజూరు చేయకపోవడంతో మెడిసిన్ సీట్లకు ఎప్పటిలాగే ఈ సంవత్సరం భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులను ఈ సంవత్సరం నుండి ఎంసెట్ ద్వారా ఎంపిక కాకుండా, నీట్ పరిధిలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
————