ఉద్దానం కిడ్నీ బాధితులతో పవన్‌ ముఖాముఖి

తెలుగు దేశం నేతలకు చిత్తశుద్ది లేదన్న జనసేనాని
వెంటనే ఆరోగ్య మంత్రిని నియమించి సమస్య పరిస్కరించాలని అల్టిమేటమ్‌
పవన్‌ బస ప్రాంతంలో విద్యుత్‌ సిబ్బంది గలాటా
శ్రీకాకుళం,మే23( జ‌నం సాక్షి): ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి సమస్యలపై 48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌  కోరారు. వ్యాధి మూలలను కనుగొనేందుకు కిడ్నీ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయకపోయినా బస్సు యాత్రను ఆపి మరీ దీక్షకు దిగుతానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన హావిూలను నెరవేర్చే చిత్తశుద్ధి లేదన్నారు. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం కన్నా దౌర్భాగ్యం మరేదీ లేదని మండిపడ్డారు. 24 గంటల్లో  ఆరోగ్య శాఖ మంత్రిని నియమించకపోతే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు. బుధవారం స్థానిక టికేఆర్‌ కల్యాణ మండపంలో ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల కిడ్నీ వ్యాధి బాధితుల కుటుంబ సభ్యులను పవన్‌ కలుసుకున్నారు. వారి సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఇదిలావుంటే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో బస చేసిన ఓ ప్రైవేటు కల్యాణమండపం వద్ద వివాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి కల్యాణ మండపం వద్దకు కొంత మంది విద్యుత్తు సిబ్బంది వచ్చారు. పవన్‌ కల్యాణ్‌ బయటకు రావాలని నినదించారు. ఈ సమయంలో పవన్‌ కల్యాణ్‌ బయటకు రారని, బుధవారం ఉదయం వస్తే కలవవచ్చని వారితో కల్యాణమండపం వద్ద కాపలా ఉన్న ప్రైవేటు సిబ్బంది చెప్పారు. ఆయన ఎలా బయటికి రారో చూస్తామంటూ  విద్యుత్తు సరఫరాను సిబ్బంది నిలిపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు జరిగి కొట్లాటకు దారితీసింది. పవన్‌ కల్యాణ్‌ బౌన్సర్‌ సునీల్‌ కాలికి గాయమైంది. కాశీబుగ్గ సీఐ అశోక్‌కుమార్‌ ఘటన స్థలానికి చేరుకుని  క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కల్యాణమండపానికి విద్యుత్తు సరఫరాను సిబ్బంది పునరుద్ధరించారు.