ఉపాధి అమలులో సర్కార్ విఫలం
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
విజయవాడ,మే24(జనం సాక్షి): ప్రభుత్వం కరువు సహాయక చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని వామపక్షనేతలు అన్నారు. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదన్నారు. సీమకు తాగునీరు, ఉపాధి కల్పించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఇకపోతే మున్సిపాల్టీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులుకు గుదిబండగా మారిన జీవో నెంబరు 279ని రద్దు చేయాలని, లేకుంటే వారికి ఆత్మహత్యలే గతి అని సిఐటియు నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో విడుదల చేసిన జివో అమలు చేస్తే ఇక ఆత్మహత్యలకు పాల్పడడం మినహా గత్యంతరం లేదని వారు పేర్కొన్నారు. 279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనేకమార్లు ఆందోళనలతో నిరసన తెలిపామాన్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ జీవో 151 ప్రకారం వేతనాలు అమలు చేయకపోగా కార్మికులకు ఉపాధిని పోగొట్టే విధంగా కొత్త జీవోలను తేవడం సరికాదన్నారు. కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవో 279ను రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం మొండివైఖరి మారాలని సిఐటియు నేతలు అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే పారిశుధ్య కార్మికులను రెగ్యులర్ చేస్తామని హామి ఇచ్చి నేడు గద్దెనెక్కి మూడేళ్లు అవుతున్న మాట నిలబెట్టుకన్న పాపాన పోలేదని విమర్శించారు. జిఒ నంబరు 151ని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కార్మికులు చనిపోతే రూ ఐదు లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, పిఎఫ్‌ను వెంటనే అందజేసి, పారిశుద్య కార్మికులకు సబ్బులు, నూనె, గ్లౌజ్‌లు, యూనిఫాం ఇవ్వాలని కోరారు.