ఏపీకి ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువ

– వాతావరణంలో మార్పులు పెనుసవాలుగా పరిణమించాయి
– వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి
– ఏపీకి ఎక్కువ సంస్థలు వచ్చేలా చూశా
– ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
– విపత్తు నివారణ సంస్థ భవనానికి శంకుస్థాపన చేసిన వెంకయ్య
– విపత్తు నిర్వహణలో ఏపీ దేశంలోనే ముందుంది
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రీజిజు
అమరావతి, మే22(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు తుఫానులు, వరదలు, సునావిూ వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ముప్పు ఎక్కువగా ఉందని.. వాటిని తప్పించుకునేందుకు విపత్తు నిర్వహణ సమర్ధంగా నిర్వహించడం ఎంతో ముఖ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు నివారణ సంస్థ భవనాలకు ఆయన మంగళవారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా మాట్లాడిన వెంకయ్యనాయుడు..10ఏకరాలలో 36.76కోట్లతో శిక్షణ సంస్థ ఏర్పాటు కానుందని, ఏడాదిలోగా భవననిర్మాణ పనులు పూర్తవుతుందని తెలిపారు. విపత్తుల శిక్షణ సంస్థ చుట్టూ ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటవుతున్నాయని వెంకయ్య చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు పెనుసవాలుగా పరిణమించాయన్నారు. అతిపెద్ద కోస్తాతీరం ఉన్న ఏపీకి ఎన్‌ఐడీఎం వంటి సంస్థలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో అనేక సంస్థలు ఏర్పాటు చేసేందుకు చొరవ చూపానని గుర్తుచేశారు. ఎన్‌ఐడీఎం నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం కేంద్ర ¬ం శాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విపత్తు నిర్వహణ కోసం రెండువేల కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభించామన్నారు. అందులో ఏపీకే మెజారిటీ వాటా దక్కుతుందని తెలిపారు. విపత్తు నిర్వహణలో ఆంధప్రదేశ్‌ దేశంలోనే ముందుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా హుద్‌హుద్‌ సమయంలో ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ చాలావరకూ నష్టాన్ని తగ్గించిందని చెప్పారు. కొండపావులూరులోని ఎన్‌ఐడీఎం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ సేవలు అందుతాయన్నారు. అత్యున్నతమైన శిక్షణ అందించే ఈ కేంద్రాన్ని ఏడాదిలోగానే పూర్తి చేస్తామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీందర్‌, కామినేని తదితరులు పాల్గొన్నారు.