ఐస్‌ ధరలతో ఆక్వా రైతుల ఆందోళన 

కాకినాడ,మే24(జ‌నం సాక్షి): మండుతున్న ఎండలకు ఐస్‌ వినియోగం పెరగడంతో వీటి ధరలు కూడా కొండెక్కాయి. ప్రధానంగా ఆక్వా పరిశ్రమలో అవసరమైన ఐస్‌ కోసం పెద్దమొత్తంలో ధరలు చెల్లించాల్సి వస్తోంది. వేసవి సీజన్‌లో మరీ ముఖ్యంగ ఆక్వా రంగానికి ఐస్‌ అవసరం ఎక్కువ. ఈ సీజన్‌లో కాలువలు కట్టేయడం ఐస్‌ తయారీకి నీరు లభ్యతకాకపోవడం వల్ల ఏటా వేసవి సీజన్‌లో ఆక్వా రైతాంగం నష్టాలను మూటకట్టుకుంది. చేపకాని రొయ్య కాని చెరువుల్లో పట్టుకున్నప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు ఐస్‌ పాత్ర చాలా కీలకం. నిన్నటి వరకు కేవలం క్యాన్‌ ఐస్‌ రూ.100 నుంచి ఈ సీజన్‌లో ఐస్‌ క్యాన్‌ రూ.550 నుంచి 600 వరకు ధర పెరిగింది. రొయ్య ధరల కన్నా ఐస్‌ ధర చాలా ఎక్కువగా పెరిగింది. దీనితో ఆక్వా రంగం కుదేలయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఆక్వారంగం విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేక చాలా ప్రాంతాల్లో చెరువుల్లో రొయ్యలు, చేపలు చనిపోతున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని చెరువుల్లో రొయ్యలు రంగు మారడం ఆందోళన కలిగిస్తోంది. వేడిమికి చేపలు చెరువుల్లోనే చనిపోతున్నాయి. మరి కొద్ది రోజులు ఇదే విధంగా పగటి ఉష్ణోగ్రతలు కొనసాగితే భారీ నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. రాష్ట్రంలోని వేసవి సీజన్‌లో పగటి ఉష్ణోగ్రతలు కొన్ని ఏళ్లుగా సహజంగానే ఉన్నాయి. కాని ఈ ఏడాది ఈ ఉష్ణోగ్రతలు రికార్డులను సృష్టించింది. దాదాపుగా  45 డిగ్రీల ఉష్ణొగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు వేసిన ఫీడ్‌ మురికఇ అడుగుకు చేరి ఆక్సిజన్‌ కొరవడడంతో  చెరువులోఅడుగుకుచేరి కాలుష్యం పెరిగి చనిపోతాయి. . ఉష్ణోగ్రతల భయంతో కేవలం 60 కౌంట్‌తో సరిపెట్టుకోవాల్సివస్తుంది. కనీసం 30 కౌంట్‌కు కూడా చేరకుండానే పట్టుబడులు చేసేస్తున్నారు. దీనికి తోడు ధరలు కూడా రొయ్య రైతులకు కలిసిరావడంలేదు. ఇప్పుడు ఐస్‌ ధరలు మరీ కుంగదీస్తున్నాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
——-