ఒకేచోట అన్ని సమస్యలకు పరిష్కారం
సిఆర్డీఎ నిర్ణయంతో సత్ఫలితాలు
అమరావతి,మే24(జనం సాక్షి): భవనాలు, ఇతర కట్టడాల ప్లాన్లు, లేఅవుట్లకు అనుమతులు, బీపీఎస్ తదితరాలకు సంబంధించిన ఫైళ్లను తక్షణమే పరిష్కరించేందుకు సీఆర్డీయే మరొక కార్యక్రమాన్ని చేపట్టింది. సమస్యలను తక్షణం పరిష్కరించాలన్న లక్ష్యం కోసం దీనిని చేపట్టారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఇటీవల దీనికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభించారు. వారంలో ఒక రోజు అన్ని స్థాయుల అధికారులు ఫైళ్లను పరిశీలించి, వాటికి సత్వర పరిష్కారం లభించేలా చూడ నున్నారు. డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగానికి చెందిన వివిధ స్థాయుల అధికారులందరూ ఒకే చోట సమావేశమై వివిధ ఫైళ్లపై తమ అభిప్రాయాలను అక్కడికక్కడే తెలియజేయడంతోపాటు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునేలా చూస్తారు. స్పాట్ స్కూట్రినీ కార్యక్రమాన్ని విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. నియమ నిబంధనలు కచ్చితంగా పాటించే దరఖాస్తుదారులకు సత్వర అనుమతులను మంజూరు చేసే ఉద్దేశ్యంతో ఇప్పటికే అమలు పరుస్తున్న ఓపెన్ ఫోరం, డెవలప్‌మెంట్ పర్మిట్ మేనేజ్‌మెంట్ సిస్టంలకు అదనంగా పైన పేర్కొన్న విధానాన్ని ప్రవేశపెట్టారు. వాటిపై సమగ్ర పరిశీలన జరిపి, వెంటనే తదనంతర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అగ్రావెల్ క్వారీయింగ్ విషయంలో నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. తవ్విన గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చివేయాలన్నారు. మైనింగ్ శాఖ ఏడీ, సంబంధిత ఇంజినీర్లు గ్రావెల్ తవ్వకాల్లో పాటించాల్సిన నిబంధనల అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునే సంస్థలకు క్యాంప్ కార్యాలయాలు, ఇతర అవసరాలకు కావాల్సిన స్థలాలను ఇంజనీర్లు నిర్ధారించి, ప్రణాళికా విభాగం పరిశీలనానంతరం వాటికి అద్దెలు సూచిస్తూ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వివిధ ఏజన్సీలు అవి పనులు నిర్వహించే ప్రదేశాల్లో క్యాంప్ కార్యాలయాలను త్వరితంగా నిర్మించుకునేలా చూడాలన్నారు.