కనుమరుగు అయిన ఆంధ్రాబ్యాంక్
విలీనంతో అతి పెద్ద బ్యాంకుగా యూనియన్
హైదరాబాద్, ఏప్రిల్ 1(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాల కాలం సేవలందించిన ఆంధ్రాబ్యాంక్ కనుమరుగయ్యింది. దేశీయ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లో విలీనంతో బుదశారం నుంచి దాని ఉనికి కోల్పోయింది. ఆంధ్రా బ్యాంకు..ఇక నుంచి బ్యాంకింగ్ సేవలో ఈ పేరు వినిపించదన్న నిజాన్ని దాని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు . లక్షలాది మంది ఖాతాదారులకు సేవలందించిన ఈ బ్యాంకు.. నుంచి యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియాగా మారింది. తెలుగు వాళ్లకు బ్యాంకింగ్ లో ఎంతో సేవలందించి.. తన అనుబంధాన్ని పెంచుకున్న ఆంధ్రాబ్యాంకును స్థాపించింది కూడా తెలుగువాడే. తెలుగు నేలపై పురుడుపోసుకున్న ఏకైక జాతీయ బ్యాంకు ఆంధ్రాబ్యాంక్ కావడం విశేషం. స్వాతంత్య సమరయోధులు డాక్టర్. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రాబ్యాంకును కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు ప్రధాన కేంద్రంగా స్థాపించారు. ఇందిర హయాంలో బ్యాంకుల జాతీయకరణలో భాగంగా ఈ బ్యాంక్ కూడా జాతీయ బ్యాంకుగా అవతరించింది. 97 సంవత్సరాలు సేవలందించి.. ఎన్నో రికార్డులను సృష్టించిన ఆంధ్రా బ్యాంకు ఇప్పుడు కనుమరుగు కాబోతోంది. యూనియన్ బ్యాంక్ లో విలీన పక్రియ కారణంగా పలు బ్రాంచీల్లో కొత్త బోర్డులను ఏర్పాటు చేశారు. యూనియన్ బ్యాంక్ అధికారులు సాదరస్వాగతం పలికారు. రూ. 10 లక్షల అధీకృత మూలధనంతో 1923 నవంబర్ లో ప్రారంభమైన ఈ బ్యాంకు.. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసింది. 1980లో ఈ బ్యాంకును జాతీయం చేశారు. జాతీయం చేసే నాటికి ఆంధ్రాబ్యాంకు 974 పూర్తిస్థాయి శాఖలు, 40 క్లస్టర్ బ్రాండ్లు, 76 ఎక్స్టెన్షన్ కౌంటర్లు ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,904 శాఖలు ఉండగా… 21,740 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇక దేశంలోనే తొలిసారి క్రెడిట్ కార్డులను జారీచేసిన చరిత్ర కూడా ఆంధ్రాబ్యాంకుదే. 2003 నాటికి వంద శాతం కంప్యూటరీకరణ సాధించింది. అటు 2007లో బయోమెట్రిక్ ఏటీఎంలను ఇండియాకు పరిచయం చేసింది ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రాబ్యాంకుతో పాటు కార్పొరేషన్ బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్ లో విలీనం అవుతోంది. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్-క్షఃఅ, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనెరా బ్యాంకులో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంకులో అలాహాబాద్ బ్యాంక్ విలీనం కానున్నాయి. రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రా బ్యాంక్ లోగో మారింది.