కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉంది
– అప్రజాస్వామిక విధానాన్ని బీజేపీ అమలు చేస్తుంది
– దేశాన్ని ఉద్దరిస్తామన్న నేతలు నోరెందుకు మెదపరు?
– ఓ విగ్రహానికి ఇచ్చిన నిధులు రాజధాని నిర్మాణానికి ఇవ్వటం లేదు
– ఆరు నెలల్లో అమరావతికి ఓరూపు వస్తుంది
– ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, మే19( జనం సాక్షి ) : కర్ణాటకలో పరిస్థితి దారుణంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్ణాటకలో అప్రజాస్వామిక విధానాలను బీజేపీ అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడులో కుట్రలు చేసిందని, ఇప్పుడు కర్ణాటకలో చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గాలి జనార్దన్‌రెడ్డి బేరసారాలు జరుపుతున్నారని, ఎన్నికల ముందు మోదీ, అమిత్‌షా ఏం చెప్పారు?.. ఇప్పుడేంచేస్తున్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు. అప్రజాస్వామ్య విధానాలతో దేశానికేం సంకేతాలిస్తారని చంద్రబాబు నిలదీశారు. కర్ణాటక, తమిళనాడులో గవర్నర్ వ్యవస్థలు విఫలమయ్యాయని సీఎం విమర్శించారు. దేశాన్ని ఉద్దరిస్తామన్న పార్టీలు, నాయకులు… కర్ణాటక పరిణామాలపై ఒక్కమాటైనా మాట్లాడడం లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోంటే.. కొందరు లేని పోని విమర్శలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే పన్నులు ఎక్కువగా కేంద్రానికే వెళ్తాయని అన్నారు. ఓ విగ్రహానికి ఇచ్చినన్ని నిధులు ఏపీ రాజధానికి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. రాజధానిపై విమర్శలు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడానికి.. అమరావతి బాండ్లు జారీ చేస్తామని, రుణాలు తీసుకుంటామని బాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రూ.24 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆరునెలల్లో అమరావతికి ఓ రూపు వస్తుందని సీఎం చెప్పారు. బలహీనవర్గాల కోసం ఐదు వేలు, ఎన్జీవోల కోసం రెండు వేల ఇళ్లు నిర్మిస్తున్నామని, పచ్చదనం.. చెరువులు, కాల్వలకు అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.