కర్నూలు కలెక్టరేట్ లో ఉద్యోగిని ఆత్మహత్య

accidentఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో ఘోరం. ఓ ఉద్యోగిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం అయ్యింది. మీటింగ్ కోసం వచ్చిన మహిళ ఈ ఘోరానికి పాల్పడటంతో మిగతా వారు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. మే 18వ తేదీ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో DRC మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆళ్లగడ్డ మండలం బత్తలూరులో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు. మీటింగ్ కు వచ్చిన ఉద్యోగిని శోభారాణి.. మధ్యలో బయటకు వెళ్లారు. నేరుగా కలెక్టరేట్ బిల్డింగ్ పైకి వెళ్లారు. అక్కడి నుంచి దూకి చనిపోయారు.ఆత్మహత్యకు  అధికారుల వేధింపులే కారణం అంటున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. కొన్ని రోజుల క్రితం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి శోభారాణి హాజరుకాలేదు. దీంతో ఐసీడీఎస్ పీడీ మెమో జారీ చేశారు. గతంలోనూ ఆమెకు మెమోలు జారీ అయ్యాయి. నిరంతరం అధికారుల నుంచి వేధింపులు, మెమోలు జారీ చేస్తుండటంపై తీవ్ర మనస్థాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అకారణంగానే శోభారాణిని అధికారులు వేధిస్తున్నారని చెబుతున్నారు. మనోవేదనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. శోభారాణికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కలెక్టరేట్ లో ఉద్యోగిని ఆత్మహత్యపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.