కింకర్తవ్యం!
– ఏంజరుగుతుందోనని ఆర్టీసీ జేఏసీలో ఉత్కంఠ
– ఎటూ తేలని ఆర్టీసీ కార్మికుల సమస్య
– విధుల్లో చేరడానికి కార్మికుల ఆసక్తి
– అయినా అనుమతి లేదంటున్న డిపో మేనేజర్లు
హైదరాబాద్,నవంబర్ 22(జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెపై ఎలూ తేలకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.జిల్లాల్లో ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో డిపోల వద్దకు చేరుకొని తమను విధుల్లోకి చేర్చుకోవాలని అధికారులను కోరుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారంలేకపోవడంతో డిపోల మేనేజర్లు వారిని వెనక్కి పంపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందా అంటూ ఆరాతీశారు. ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, రాగానే విధుల్లోకి తీసుకుంటామని డీఎం చెప్పడంతో వెనుదిరిగిపోతున్నారు. కొనని డిపోల్లో కార్మికులు డిపో మేనేజర్లను కలిసి యాజమాన్యం మానవతాదృక్పథంతో ఆలోచించి విధుల్లో చేర్చుకోవాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత చేర్చుకొంటామని అధికారులు చెప్పడంతో వెనక్కివెళ్లిపోయారు. వరుసగా రెండోరోజూ ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. చాలామంది కార్మికులు బేషరతుగా విధుల్లో చేరుతున్నట్లు పత్రాలు సమర్పించేం దుకు ముందుకొచ్చారు. మరికొందరు విధుల్లో చేరడమెలా అని డిపోమేనేజర్లను ఆరాతీశారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు కానీ, ఆదేశాలు కానీ రాలేదని.. ప్రభుత్వం నుంచి ఏదో ఒక నిర్ణయం వస్తేకానీ తామేం చేయలేమని డీఎంలు నిస్సహాయత వ్యక్తం చేశారు. దీంతో సాయంత్రం వరకు కార్మికులు డిపోల వద్ద వేచిచూసి తిరిగి వెళ్లిపోయారు. సమ్మెవల్ల ఆర్థికంగా నష్టపోయామని.. విలువైన సమయం వృథా అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు అవకాశమిస్తే ఉద్యోగంలో చేరి తమ పని తాము చేసుకొంటామన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఒకరికొకరు సమ్మె కొనసాగింపు.. తదనంతర పరిణామాలపై చర్చించుకోవడం కనిపించింది. డిపోల దగ్గరికి పెద్ద సంఖ్యలో కార్మికులు రావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టంచేశారు. సమ్మె విరమించి విధుల్లోకి తిరిగి చేరడమెలా అన్నదానిపై ఆరాతీశారు. జేఏసీ నాయకులు తమ స్వలాభంకోసమే సమ్మెచేశారని.. సమ్మె పేరుతో తమను తప్పుదోవ పట్టించి వేతనాలు కోల్పోయేలా చేశారని కొందరు ఆవేదన వ్యక్తంచేశారు. పలువురు కార్మికులు చనిపోవడానికి కారణం జేఏసీ నేతల ఒంటెత్తుపోకడ, స్వార్థపరమైన ఆలోచనలేనని విమర్శిస్తున్నారు.
డ్యూటీలు ఇవ్వాలని కార్మికులు డిపోలకు వెళ్లొద్దు
– ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరుతామని డిపోలకు వెళ్లొద్దని, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటామని ప్రభుత్వం తెలిపితేనే విధుల్లోకి వెళ్దామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. శుక్రవారం ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ జేఏసీ నాయకులు అత్యవసర సమావేశమయ్యారు. సమ్మెను విరమిస్తామని చెబుతున్నా ప్రభుత్వం స్పందించక పోవటం దారుణమ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమ్మెను కొనసాగిద్దామని నిర్ణయించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సమ్మె యధాతథంగా కొనసాగుతోందన్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ విషయంలో ఇంకా వేచి చూస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. శనివారం ప్రతి డిపో ముందు ర్యాలీ చేపడతామన్నారు. సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసనలు చేస్తామన్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఆర్టీసీ కార్మికుల కష్టాలు తెలియజేస్తామన్నారు. ఆర్టీసీ జేఏసీ చేసిన సమ్మె విరమణ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరం అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనట్టు కనిపిస్తోందన్నారు. కోర్టు తీర్పు గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అశ్వత్థామరెడ్డి అన్నారు. కార్మికులు విధుల్లో చేరినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. కార్మికులెవరూ విధుల్లో చేరలేదని చెప్పారు. కార్మికులు ధైర్యాన్ని కోల్పోవద్దన్నారు. డ్యూటీలు ఇవ్వాలని డిపోలకు వెళ్లొద్దన్నారు. కార్మికులను విధుల్లోకి చేర్చుకునే అంశంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. మరోసారి సమావేశం అవుతామని.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వం చెబుతున్నట్టు కార్మికుల వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగలేదన్నారు.
విధుల్లో చేరుతామన్నా చర్చించరా?
సిఎం కెసిఆర్ వైఖరిపై జెఎసి నేతల మండిపాటు
సమ్మె విరమించి విధుల్లోకి చేరతామని చెప్పినా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమస్యను పరిష్కరిద్దామనే ఆలోచన లేదని ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెను ఇంకా ఉధృతం చేయాలని భావిస్తున్నామని చెప్పారు. తాత్కాలికంగా విలీనం అంశాన్ని పక్కనపెట్టి ఒక మెట్టు దిగివచ్చినా.. సీఎం చర్చలకు పిలవలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రం ముఖ్యమంత్రి ఆర్టీసీ సమ్మెపై సవిూక్ష నిర్వహిస్తారని, అనంతరం ప్రకటన చేస్తారో లేదో చూసి శనివారం జేఏసీ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాజిరెడ్డి స్పష్టం చేశారు. అంతకుముందు శుక్రవారం ఉదయం ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిచకపోవడంతో.. సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులు ఎవరూ విధుల్లో చేరలేదని.. అసత్య ప్రచారాలు చేయవద్దని అన్నారు. శనివారం సేవ్ ఆర్టీసీ పేరుతో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.