కుట్ర నిరూపించండి…

– అఫిడవిట్‌పై కాంగ్రెస్‌, బీజేపీ ధ్వజం
హైదరాబాద్‌,నవంబర్‌ 17(జనంసాక్షి):ఆర్టీసీపై అసత్యాలతో కూడిన అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన సునీల్‌ శర్మ వెంటనే విధులనుంచి డిస్మిస్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కాంగ్రెస్‌, ఆర్టీసీ యూనియన్లు చేయడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగ బద్దంగా పోరాడుతోందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసినట్లు ఆధారాలు ఉంటే జైలుకు పంపాలని ఆయన సవాలు విసిరారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినట్టు ఉత్తమ్‌ గుర్తుచేశారు. కార్మికులకు సెప్టెంబర్‌ నెల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 19న నిర్వహించే సడక్‌ బంద్‌ కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు. 24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా? అని నిలదీశారు. కేసీఆర్‌ అమానవీయ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఉత్తమ్‌ కుమార్‌తో భేటీ అయి సమ్మెపై చర్చించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులే సమ్మెకు కారణమని వారు అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి ఎండీ లేకపోవడంతో ఉన్నతాధికారుల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకు దిగినట్లు ఉత్తమ్‌కు వివరించారు.
సునీల్‌ శర్మ వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించాలి
– మండిపడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
ఇంట్లో నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ కార్మిక సంఘాల ఏకాస కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అరెస్టు అక్రమమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు . ఆర్టీసీ సమ్మె 44 రోజులుగా జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు .భాజపా కార్యాలయంలో లక్ష్మణ్‌ విూడియాతో మాట్లాడారు. సీఎం, మంత్రుల వ్యాఖ్యలతో 24 మంది ఆర్టీసీ కార్మికులు మృతిచెందారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వారికి అండగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఇప్పుడేమయ్యారని లక్ష్మణ్‌ ప్రశ్నించారు .ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు . ఆర్టీసీ ఇన్‌ఛార్జ్‌ ఎండీ సునీల్‌ శర్మ వేసిన అఫిడవిట్‌ చూస్తుంటే ఆయన ఐఏఎస్‌ అధికారా? లేక తెరాస ప్రధాన కార్యదర్శా? అన్నది అర్ధం కావడం లేదని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. ఒక ఏఏఎస్‌ అధికారి ఇంతలా దిగజారడం ఎక్కడా చూడలేదన్నారు . అఫిడవిట్లో సునీల్‌ శర్మ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని కోరారు. భాజపాపై ఆయన చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంలో సునీల్‌ శర్మపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని లక్ష్మణ్‌ తెలిపారు .

తాజావార్తలు