కేంద్రంలో రాబోయేది భాజపాయేతర ప్రభుత్వమే

– బెంగళూరులో ప్రాంతీయ, వామపక్షాల భేటీయే ఇందుకు నాంది
– కాళ్లుపట్టుకునే రాజకీయాల్లో జగన్‌ది అందెవేసిన చేయి
– చంద్రబాబు వామపక్ష, ప్రాంతీయ పార్టీల నేతలతోనే భేటీ అయ్యారు
– కాంగ్రెస్‌ పార్టీతో కాదు
– విషప్రచారం చేయడంలో వైకాపా, బీజేపీల పని
– విలేకరుల సమావేశంలో ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల
అమరావతి, మే24(జ‌నం సాక్షి) : కేంద్రంలో రాబోయేది భాజపాయేతర ప్రభుత్వమేనని ఆంధప్రదేశ్‌ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బెంగళూరులో జరిగిన ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల భేటీయే ఇందుకు నాంది పలికిందని పేర్కొన్నారు. గురువారం యనమల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెంగళూరులో కుమారస్వామి ప్రమాణానికి జగన్మోహన్‌ రెడ్డి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. కర్ణాటకలో భాజపాతో పనిచేసినందున ముఖం చెల్లదు కాబట్టే జగన్‌ ఆ కార్యక్రమానికి వెళ్లలేదని ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుకు ఉన్న ఇమేజి దేశంలో అందరికీ తెలిసిందేనని యనమల అన్నారు. కాళ్లు పట్టుకునే రాజకీయాల్లో జగన్‌ది అందెవేసిన చేయి అని.. కేసుల మాఫీ కోసం కేంద్రంలో పెద్దల కాళ్లు పట్టుకోవడం ఆయన సంస్కృతని ధ్వజమెత్తారు. బెంగళూరులో ప్రాంతీయ పార్టీలు, వామపక్షాల నేతలతో మాత్రమే చంద్రబాబు భేటి అయ్యారని.. కాంగ్రెస్‌తో కాదన్న సంగతి వైకాపా, భాజపా నేతలు గ్రహించాలని హితవు పలికారు. విభజనతో ఆంధప్రదేశ్‌ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వారితో చర్చించినట్లు చెప్పారు. జేడీ(ఎస్‌) ఆహ్వానం మేరకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లారు తప్ప.. కాంగ్రెస్‌ పిలిచిందుకు కాదన్న విషయం గ్రహించాలని యనమల స్పష్టం చేశారు. వేదికపై ఎవరైనా ఎదురైనప్పుడు అభినందించుకోవడం భారతీయ సంస్కారమని…, దానిని కూడా తప్పు పట్టడం భాజపా-వైకాపాల విష సంస్కృతి అని దుయ్యబట్టారు. జాతీయగీతం వస్తుంటే సభ నుంచి వెళ్లిపోవడం యడ్యూరప్ప సంస్కృతి అని మండిపడ్డారు. చంద్రబాబుకున్న ఘన చరిత చూసే బెంగళూరులో అన్నిపార్టీలు గౌరవించాయని…, భాజపా తప్ప ఎవరూ జగన్మోహన్‌రెడ్డిని, అతని పార్టీని కలుపుకోరని ఆక్షేపించారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లలేదని.. ఎదురైతే అభినందించడాన్ని తప్పుపట్టడం దివాలాకోరుతనం అని విమర్శించారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన భూమిక చంద్రబాబుదేనని.. దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించారని యనమల గుర్తు చేశారు. దేవెగౌడతో సాన్నిహిత్యం, కుమార స్వామి ఆహ్వానం మేరకే బెంగళూరు వెళ్లారని… అందుకే ప్రమాణ స్వీకారంలో భాగం పంచుకున్నామని వెల్లడించారు. ప్రాంతీయపార్టీలు, వామ పక్షాల నేతలతో తన ఛాంబర్లో చంద్రబాబు చర్చలు జరిపారన్నారు. కాంగ్రెస్‌ మంత్రుల ప్రమాణానికి సోనియా, రాహుల్‌ హాజరయ్యారని.. 2019లో భాజపాతో పొత్తు కోసమే జగన్‌ కుమారస్వామి ప్రమాణానికి హాజరుకాలేదని ఆరోపించారు. భాజపా కర్ణాటకలో గాలి జనార్ధన రెడ్డితో, ఏపీలో జగన్మోహప్‌రెడ్డితో వెళ్తోందని.. ఆ పార్టీ వైఖరి చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశ్నించారు.