కేరళలో శ్రమదానం చేసేందుకు పార్టీలు కదలాలి

వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి ఆపన్నహస్తం అందించడంలో ఇప్పుడు దేశం యావత్తు ముందుండాలి. వరదలు కొచెం తగ్గుముఖం పడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పలుగూ పారా పట్టాలి. చీపురు పట్టాలి. తట్టలు పట్టాలి. వివిధ పార్టీల కార్యకర్తలు ముందుగా ఈ పనిలో దిగాలి. పార్టీలు వెంటనే తమ కార్యకర్తలను అక్కడ రంగంలోకి దింపి ప్రజలు మళ్లీ బతికి బట్టకట్టేలా చూడాలి. ఇకపోతే వైద్యశిబిరాలు, అన్నం వండిపెట్టే శిబిరాలు ఏర్పాటు చేయాలి. వర్షబీభత్సంతో అక్కడంతా బురద నిండిపోయి ఉంటుంది. పాములు,తేళ్లు, ఇతర విషకీటకాలు చేరి ఉంటాయి. వీటి నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయాలి. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా విరివిగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. వీలైనంతమంది కార్యకర్తలు కేరళలో మకాం వేసి పరిశుభ్రత ఏర్పడే వరకు శ్రమదానం చేయాలి. కేరళకు ఇప్పుడు కావాల్సింది శ్రమదానమే. ఊరూవాడా అంతా శుభ్రం చేసే వారు కావాలి. రాజకీయ పార్టీలు ఉపన్యాసాలు ఇవ్వడం కాకుండా కార్యకర్తలను రంగంలోకి దింపి కేరళను శుభ్రం చేసే పనిలో నిమగ్నం కావాలి. దేశానికి ఆదర్శంగా చూపేలా ప్రతి పార్టీ తమవంతుగా కార్యకర్తలను రంగంలోకి దింపాలి. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు తమవంతుగా ఆర్థిక సాయం అందించాయి. వస్తు సామాగ్రిని పంపాయి. బట్టలు, తిండి గింజలు పంపుతున్నారు. అయితే ఇవన్నీ చేరాలంటే అక్కడ ముందు నిలబడగలిగేలా పరిసరాలు ఉండాలి. అక్కడ ఇళ్లను మొదలు, వీధులు శుభ్రం చేసే యాంత్రాంగం కావాలి. ఇకపోతే సాయంలో తెలంగాణ ముందున్నది. కష్టకాలంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ రూ.25 కోట్ల సహాయం ప్రకటించడంతో పాటు నేరుగా అందచేశారు. తెలంగాణతోపాటు ఇలా అందరూ ముందుకు వచ్చి సహాయం చేయడమనేది మనమంతా భారతీయులమనే స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తున్నది. మానవీయ విషాదంలో, ఇతర రాష్టాల్ర నుంచి, వివిధ ప్రజాసమూహాల నుంచి వెల్లువెత్తుతున్న సానుభూతి, అందుతున్న విరాళాలు, సహాయసామగ్రి అమూల్యమైనవి. సాటి మనుషులకు వచ్చిన కష్టంపై స్పందిస్తూ, మౌలిక మానవీయ విలువలను నిలబెడుతున్న వారందరికీ ఈ సందర్భంగా జేజేలు చెప్పాలి. అత్యంత క్లిష్టమూ కష్టతరమూ అయిన సహాయచర్యలలో పాలుపంచుకుంటూ,మరింత ప్రాణనష్టాన్ని నివారిస్తున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు, సైనిక, పారా మిలటరీ, పోలీసు బలగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛందంగా రంగంలోకి దిగిన వలంటీర్లూ వీరందరి సాహసాన్నీ శ్రమనీ అభినందించాలి. కేంద్రబలగాలు సహాయ చర్యలకు రంగంలోకి దిగి శాయశక్తులా ప్రాణరక్షణ చేస్తున్నాయి. వరద బాధిత కేరళకు తెలంగాణ నుంచి సాయం వెల్లువెత్తుతున్నది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవచేసి వివిధ రూపాల్లో సాయం అందిస్తోంది. మంత్రులు, ప్రజాప్రతినిధు లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో పాటు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు.. విశేష సంఖ్యలో ప్రజలు తమకు తోచిన విరాళాన్ని వివిధ మార్గాల్లో కేరళకు అందజేస్తున్నారు. ఇప్పటికే రూ.25 కోట్ల నగదు సాయం, రెండున్నర కోట్ల విలువ చేసే నీటిశుద్ధి మిషన్లు, చిన్నారుల కోసం వంద టన్నుల బాలామృతం, 20 టన్నుల పాలపొడిని కేరళకు తెలంగాణ ప్రభుత్వం అందచేసింది. తాజాగా 500 టన్నుల బియ్యాన్ని పంపనున్నది. వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి బియ్యం పంపాలని కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన విజ్ఞప్తికి సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించారు. కేరళ వరదలతో పశువుల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా 1.25 లక్షల డోసుల వ్యాక్సిన్‌, పశువులకు మేత సమస్య తీర్చేందుకు 100 టన్నుల దాణా తీసుకెళ్లే వాహనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం పంపించింది. కేరళలో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న భరోసా ఇచ్చేలా ప్రతి ఒక్కరూ ముందుకు

రావాల్సిన సమయమిది. పునరావాస కార్యక్రమాల్లో భాగంగా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు డబ్బు,వస్త్రం,ఆహార రూపంలో సాయం అందుతోంది. అయితే అక్కడ వరదల్లో చిక్కుకున్న వారికి ఈ సాయం అందచేసేలా పనిచేసేవారు లేరు. ఎవరూ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేకుండా ఎవరికి వారు అక్కడికి వెళ్లి సాయం చేసేందుకు ఉద్యమించాలి. ప్రధానంగా అయ్యప్ప భక్తులు కూడా అక్కడికి వెళ్లి ఆపన్నులకు సేవలు చేస్తే అంతకు మించిన స్వామిసేవ మరోటి ఉండదు. రాజకీయ పార్టీలు ప్రధానంగా విరాళాలతో పాటు సాయం చేసేందుకు తమ సైన్యాన్ని రంగంలోకి దింపాలి. ఎంతమంది అక్కడ సేవ చేశారన్నది ఇప్పుడు ముఖ్యం కేంద్రమంత్రి ఆల్ఫోన్స్‌ అన్నట్లు అక్కడ ఇప్పుడు చేయా ల్సింది శ్రమదానం తప్ప మరోటి కాదు. బురదలో దిగి సేవచేసే వారు కావాలి. వారంతా ఎవరి పిలుపుకో ఎదురు చూడకుండా వెంటనే రంగంలోకి దిగితే అంతకన్నా మాధవేవ మరోటి ఉండదు. ఈ దేశం ఐక్యతను చాటడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. కేరళలో సాధారణ పరిస్థితులు వచ్చి మళ్లీ ప్రజలు ధైర్యంగా జీవించడానికి అసవరమైన ఆత్మస్థయిర్యం ఇవ్వాలి. అప్పుడే మానవత్వం నిరూపితం అవుతుంది. అందుకు ఎంతమంది కార్యకర్తలు వెళతార్నది చూడాలి. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళ ప్రజలకు అపన్నహస్తం అందించేందుకు ప్రతిఒక్కరూ అండగా నిలవాల్సిన సమయమిది. అందుకు మనమంతా కదలడమే దీనికి పరిష్కారం. దీనిని సజావుగా నిర్వహించి ఐక్యతను చాటే ప్రయత్నం చేయాలి.