కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు

` విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు, వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి
` పలు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం
కోల్‌కతా(జనంసాక్షి):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను ముంచెత్తాయి. వరదల కారణంగా ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ షాక్‌ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. వరదల్లో కొట్టుకుపోయి మరో ఇద్దరు మరణించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నందున దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వానల వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు విమానయాన సంస్థలు వెల్లడిరచాయి. అటు ఎయిరిండియా, ఇండిగో ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి. తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచించాయి.భారీ వర్షాల కు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లల్లోనే ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వరదల వల్ల షాహిద్‌ ఖుదిరామ్‌, మైదాన్‌ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకరస్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ల్లో కొండచరియలు విరిగిపడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పఠాన్‌కోట్‌, గుర్‌దాస్‌పుర్‌, ఫాజిల్కా, కపూర్థలా, తరన్‌తరన్‌, ఫిరోజ్‌పుర్‌, హోశియార్‌పుర్‌, అమృత్‌సర్‌ జిల్లాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ ఆరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. పంజాబ్‌లో వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.