ఎనిమిదేళ్లుగా దోచుకుని ఇప్పుడు సంబరాలా?


` జిఎస్టీపై దోపిడీ పొన్నం ఆగ్రహం
హైదరాబాద్‌(జనంసాక్షి):జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధ్వజమెత్తారు. దేశ ప్రజలను దోచుకునేందుకే నాడు జీఎస్టీని ఆయుధంగా వాడారని, వాళ్లే పన్నులు వేసి, వాళ్లే తగ్గించి, ఇప్పుడు వాళ్లే సంబురాలు చేసుకుంటున్నారని దీనిని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని ఆయన దుయ్యబట్టారు. మంగళవారం గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం విూడియాతో మాట్లాడుతూ 8 ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేదల రక్తం తాగి ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్టు- బిజెపి నాయకులు బిల్డప్‌ ఇస్తున్నారని ఆయన ఫైర్‌ అయ్యారు. జీఎస్టీ తగ్గింపు అంత ఎన్నికల డ్రామా అని, ఇంకా జీఎస్టీ ఫలాలు పేదోడికి అందలేదన్నారు.
కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2025లో దసరా, దీపావళి పండుగలను జీఎస్టీ రూపంలో ముందుగానే తీసుకువచ్చారని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునం దన్‌రావు ఉద్ఘాటించారు. కొంతమంది తెలివి లేని వాళ్లు జీఎస్టీ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వాళ్లందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వరస్వామిని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం విూడియాతో ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో దర్శన ఏర్పాట్లు- చాలా బాగున్నాయని వివరించారు. దసరా ఏర్పాట్లు బాగా చేసిన కలెక్టర్‌, ఆలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఆలయ కమిటీలు ఇంకా వేసినట్లు- లేదని, త్వరలో వేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు ఎంపీ రఘునందన్‌రావు. జీఎస్టీ రూపంలో గతంలో ప్రజలపై విపరీతమైన భారాలు వేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనని మండిపడ్డారు. గతంలో కాఫీ విూద కూడా జీఎస్టీ 28 శాతం ఉండేదని గుర్తుచేశారు. దేశ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నిండు నూరేళ్లు ఆయుష్షు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని పేర్కొన్నారు. 4 స్లాబులుగా ఉండే జీఎస్టీని 2 శ్లాబులుగా చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు.