కృష్ణాజలాల్లో 70% వాటా మాదే
` ఏడిదాకైనా కొట్లాడుతాం
` నీటి వాటాకోసం వెనక్కు తగ్గేదేలేదు
` గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది
` ట్రైబ్యునల్‌లో సమర్థమైన వాదనలు వినిపిస్తాం: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
` అల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతామని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):కృష్ణా ట్రైబ్యునల్‌లో రాష్ట్రం తరఫున సమర్థమైన వాదనలు వినిపిస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు కృష్ణా ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి.ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ దిల్లీ వెళ్లారు. ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తామన్నారు.‘’కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా తప్పక రావాల్సిందే. ట్రైబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారు. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్-2 ఉమ్మడి రాష్ట్రానికి 1050 టీఎంసీలు కేటాయిచింది. ఇప్పుడు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70 శాతం కేటాయించాలని వాదనలు వినిపిస్తున్నాం. సాగుభూమి, నదీ పరివాహకంలో జనాభా ఆధారంగా అధిక వాటా కోరుతున్నాం. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. కేవలం 299 టీఎంసీలకు అంగీకరిస్తూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసింది. ఈ చర్యతో రాష్ట్రానికి పదేళ్లుగా అన్యాయం జరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 780 టీఎంసీలను కోరుతోంది’’‘’ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను బేసిన్ అవతలకు తరలిస్తోంది. అల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతాం. తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడుతాం’’ అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు’’