కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్‌

పన్నూకు అత్యంత సన్నిహితుడుగా పేరు
న్యూఢల్లీి(జనంసాక్షి):ఖలిస్థానీ ఉగ్రవాది ఇందజ్రీత్‌ సింగ్‌గోసల్‌ కెనడాలో అరెస్టయ్యాడు. సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే వేర్పాటు-వాద సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూకు అతడు సన్నిహితుడు. 2023 నుంచి గోసల్‌ కెనడాలో ఎస్‌ఎఫ్‌జే కార్యకలాపాలు చూసుకుంటున్నాడు.ఆయుధాలు కలిగిఉండటం సహా పలు అభియోగాలపై గోసల్‌ను అట్టావాలో తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ విూడియా కథనాలు పేర్కొన్నాయి. గత నవంబర్‌లోనూ కెనడా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గ్రేటర్‌ టొరంటో ఏరియాలోని ఒక హిందూ ఆలయం వద్ద చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో ప్రమేయం ఉందని ఆ సమయంలో ఆరోపణలు వచ్చాయి. తర్వాత షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు అయింది. ఇదిలాఉంటే.. ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసేందుకు భారత కెనడాల మధ్య అంగీకారం కుదిరిందని ఇటీవల మన విదేశాంగ ప్రకటించింది. ఈ అంగీకారంలో భాగంగా ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2023లో ఒక సిక్కు వేర్పాటు-వాది హత్య అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండు దేశాలు సంబంధాలను పునరుద్ధరించు కుంటున్నాయి. దానిలో భాగంగా భారత్‌, కెనడాలు ఉపసంహరించుకున్న రాయబారులను ఇటీ-వల తిరిగి నియమించుకున్నాయి. అనంతరం సంబంధాల పునరుద్ధరణే లక్ష్‌యంగా దేశ రక్షణ సలహాదారు అజిత్‌ డోభాల్‌, కెనడా భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్‌ల మధ్య చర్చలు జరిగాయి. జూన్‌లో కెనడాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల సంబంధాలపై అక్కడి ప్రధాని మార్క్‌ కార్నీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అరెస్ట జరగడం విశేషం.