అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..

` మోహన్‌లాల్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
` పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు, దర్శకులకు పురస్కారాలు అందజేత
న్యూఢల్లీి(జనంసాక్షి):71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము..పురస్కారాలతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. 2023కి గానూ కేంద్రం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఉత్తమ నటుడి అవార్డును షారుక్‌ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే, ఉత్తమ నటి అవార్డును రాణీ ముఖర్జీ (మిసెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే) స్వీకరించారు. ఇదే వేడుకలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును మోహన్‌లాల్‌కు ప్రదానం చేశారు. అంతకుముందు శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్‌ మాట్లాడుతూ.. ‘’దాదా ఫాల్కే పురస్కారాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. అంతా మ్యాజిక్‌ అనిపిస్తోంది. ఈ అవార్డు అందుకోవడం గౌరవంగా ఉంది. ఈ పురస్కారం నా ఒక్కడికే కాదు ఇది మలయాళ సినీ పరిశ్రమకు చెందుతుంది. మరింత బాధ్యతగా పనిచేస్తా’’ అని పేర్కొన్నారు. టాలీవుడ్‌ నుంచి ఉత్తమ చిత్రంగా ‘భగవంత్‌ కేసరి’ ఎంపిక కాగా దర్శకుడు అనిల్‌ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు అందుకున్నారు. సాయి రాజేశ్‌ (ఉత్తమ స్క్రీన్‌ప్లే- బేబీ సినిమా), పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ (ఉత్తమ నేపథ్య గాయకుడు- బేబీ మూవీ), ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌ సినిమా.. బెస్ట్‌ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌) హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ (ఉత్తమ నేపథ్య సంగీతం- యానిమల్‌ మూవీ), సుకృతి వేణి (ఉత్తమ బాల నటి- గాంధీతాత చెట్టు) తదితరులు అవార్డులు పొందారు.