గిరిజనులను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు
– నాలుగేళ్లలో మ్యానిఫెస్టోలోని ఒక్కహావిూ నెరవేర్చలేదు
– అధికారంలోకి రాగానే గిరిజనులకు పావలావడ్డీకే రుణాలు
– బ్యాక్‌లాగ్ పోస్టులను పూర్తి చేస్తాం
– దీర్ఘకాలిక రోగాలతో బాధ పడేవారికి నెలకు రూ. 10వేల పెన్షన్
– గిరిజనులకు వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ హావిూ
– పాదయాత్రలో భాగంగా ప్రకాశరావుపాలెంలో గిరిజనులతో సమావేశమైన జగన్
ఏలూరు,మే19(జనం సాక్షి): గిరిజనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ శనివారం ప్రకాశరావుపాలెంలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల టీడీపీ పాలన చాలా అధ్వానమని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి బాబు ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్ జగన్ విమర్శించారు. గిరిజనులకు ఇళ్లు ఇవ్వలేదు, భూములూ ఇవ్వలేదన్నారు. గూడెంలలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌లు ఏర్పాటు చేశారా అని జననేత నిలదీశారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు డ్రామాలు మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు. గిరిజన సబ్‌ప్లాన్ నిధులు ఏమైయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీయండి, రాష్ట్రంలో గిరిజన వర్సిటీ ఎక్కడైనా కనిపించిందా అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో ఏడు గిరిజన అసెంబ్లీ స్థానాలున్నాయని, ఏడు నియోజకవర్గాల్లో 6స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలిచిన విషయాన్ని జననేత గుర్తు చేశారు. గిరిజనులకు వైఎస్. రాజశేఖర్‌రెడ్డి 13లక్షల ఎకరాలు పంపిణీ చేశారని జగన్ గుర్తుచేశారు. పెద్ద చదువులు చదివితేనే పేదరికం నుంచి బయటపడతామని, గిరిజనులకు మంచి వైద్యం అందుబాటులో ఉండాలన్నారు. గిరిజన సలహా మండలిని చంద్రబాబు మొన్నటిదాకా వేయలేదని, గిరిజన సలహా మండలితోనే బాబు ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు. గిరిజనులను ఆదుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. మనం
అధికారంలోకి రాగానే గిరిజనులకు పావలావడ్డీకే రుణాలు ఇస్తామని, అదికారంలోకి రాగానే బ్యాక్‌లాగ్ పోస్టులను పూర్తి చేస్తామన్నారు. గిరిజన మహిళలకు 45 ఏళ్లకే రూ. 2 వేలు పెన్షన్ ఇస్తామన్నారు. అంతేకాక మంచి వైద్యం అందుబాటులో ఉంచుతామని, రూ. వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద పరిగణిస్తామన్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధ పడేవారికి నెలకు రూ. 10వేల పెన్షన్, ఎన్ని లక్షలు ఖర్చైనా పేద పిల్లలను చదివిస్తామన్నారు. మెస్, బోర్డింగ్ ఛార్జీలకు ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. చిన్నారులను బడికి పంపితే ఏడాదికి రూ. 15 వేలు ఇస్తామని’ వైఎస్ జగన్ చెప్పారు. 500 జనాభా ఉంటే గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని జగన్ చెప్పారు. అంతేకాక ప్రతి పేదవాడికి భూములు పంచుతాం, పెట్టుబడి కింద ప్రతి మే నెలలో రూ. 12,500 ఇస్తామని తెలిపారు. పొల్లాల్లో ఉచితంగా బోర్లు కూడ వేయిస్తామన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ కట్టిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
వైసీపీలో చేరిన జేసీ అనుచరుడు..
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, యూత్ కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గోపాలనగరం నియోజకవర్గంలో
పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి అతని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అతనితో పాటు వందలాది మంది అనుచరులు పార్టీలో చేరారు. దీంతో ఎంపీ జేసీకి ఎదరుదెబ్బ తగిలింది.