చలో టాంక్‌బండ్ హింసాత్మకం
– ట్యాంక్‌బండ్‌వైపు భారీగా దూసుకొచ్చిన ఆందోళనకారులు
– అడ్డుకున్న పోలీసులు..
హైదరాబాద్, నవంబర్ 9(జనంసాక్షి):ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ ఉద్రిక్తంగా మారింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు నిర్వహించతలపెట్టిన సకల జనుల సామూహిక దీక్షల్లో పాల్గొనేందుకు జిల్లా కేంద్రాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళా కార్మికులు కూడా భారీగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. గతంలో మిలియన్ మార్చ్ సందర్భంగా జరిగిన ఘటనల నేపథ్యంలో చలో ట్యాంక్ బండ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే దారులన్నీ దాదాపుగా మూసివేశారు. జిల్లాల నుంచి వస్తున్న కార్మికులను ట్యాంక్ బండ్ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నారు. ట్యాంక్ బండ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ పోలీసు వలయాన్ని ఛేదించి ఆర్టీసీ కార్మికులు ట్యాంక్ బండ్ వైపు దూసుకొచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన కంచె, బారీకేడ్లను దాటుకుని ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ఒక్కసారిగా ఫెన్సింగ్‌ను పక్కను నెట్టేసి పరుగులు తీయడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్యాంక్ బండ్ వద్దనున్న వెంటకస్వామి విగ్రహం వద్ద ఉన్న పార్కు వద్దకు వందల సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. సుమారు 300 మంది ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ట్యాంక్ బండ్‌పైకి చేరుకుని దీక్షల్లో కూర్చున్నారు. పోలీసు వలయాన్ని ఛేదించి కార్మికులు ట్యాంక్ బండ్‌కి చేరుకోవడంతో పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దఎత్తున పోలీసు బలగాలు ట్యాంక్ బండ్‌పైకి చేరుకుని కార్మికులను పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాల్లో హైటెన్షన్ నెలకొంది. ట్యాంక్ బండ్‌వైపుకు దూసుకొచ్చిన పలువురు కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆందోళన కారులపై టియర్‌గ్యాస్ ప్రయోగించారు. పలువురిపై లాఠీ చార్జి చేయడంతో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. పలువురు ఆందోళన కారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే ఇదిరాపార్క్, దోమలగూడ, హిమాయత్ నగర్‌లోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ కార్మికులు గుంపులు గుంపులుగా చేరి అక్కడి నుంచి ఒక్కొక్కరిగా బయలు దేరి వస్తున్నారని పోలీసులు గుర్తించారు. దీంతో భద్రతను పటిష్ఠం చేశారు. బీజేపీ ఎంపీ సంజయ్ ఆధ్వర్యంలో 200మంది ఆందోళన కారులు ట్యాంక్ బండ్‌పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకోని గోషా మహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల అదుపులో అశ్వత్థామరెడ్డి ..
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు ‘చలో ట్యాంక్‌బండ్’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని గోల్కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశ్వత్థామతో పాటు పలువురు జేఏసీ నేతలను సైతం పీఎస్‌కు తరలించారు. కాగా హైదరాబాద్‌లో ఇప్పటి వరకూ 170 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ అంజనీకుమార్ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే..
శుక్రవారం మధ్యాహ్నమే జేఏసీ కో-కన్వీనర్ కె.రాజిరెడ్డి గుర్తు తెలియని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర రిజిస్టేష్రన్ ఉన్న వాహనంలో ఆయనను తరలించినట్లు కార్మిక నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ నేత అంజన్‌కుమార్ యాదవ్‌ను కూడా ముందుస్తుగా అదుపులోకి తీసుకున్నారు.