జీవో 279ను వెంటనే రద్దు చేయాలి: సిఐటియూ
విశాఖపట్టణం,మే24(జనం సాక్షి): పారిశుద్ధ్య కార్మికులకు గుదిబండగా మారిన జీవో 279ను వెంటనే రద్దు చేయాలని సిఐటియూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులను ముంచేందుకే దీనిని తీసుకుని వచ్చారని మండాపడ్డారు. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత ఇక ప్రైవేటుకు అప్పగించాలని పుర పరిపాలనా విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకు సంబంధించి జిఒ 279ని విడుదలచేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఆయా కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు కౌన్సిల్ సమావేశాల్లో తీర్మానాలు చేశాయి. కొన్ని పురపాలక సంఘాలు టెండర్ల దశకు చేరగా, మరికొన్ని ఆ పనిలో ఉన్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుంటాయి. అయినా సమస్య సమస్యగానే మిగిలిపోతోంది. దీంతో కమిషనర్లకు ఇది తలకు మించిన భారంగా పరిణమించింది. ఈ పారిశుద్ధ్య పనులను టెండర్ల ద్వారా దక్కించుకున్న వారు పురపాలక సంఘం అధికారుల పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తారు. అయితే పారిశుద్ధ్య కార్మికుల వ్యవహారం పూర్తిగా కాంట్రాక్టర్లకే సంబంధం ఉంటుంది. వేతనాలు, పనులు చేయించడం తదితరాలు కాంట్రాక్టర్లే చూసుకుంటారు. ఇలా ప్రైవేట్ రంగానికి అప్పగించడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. టిడిపి ఎన్నికల వాగ్దానం ప్రకారం కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేకుంటే కార్మికుల పక్షాన చివరి వరకు పోరాటం చేస్తామన్నారు.