టీటీడీని రాజకీయంగా వాడుకుంటున్నారు
– వైసీపీ, బీజేపీవీ దుర్మార్గమైన రాజకీయాలు
– విజయసాయిరెడ్డి నీ చరిత్ర ఏమిటో తెలుసుకొని మాట్లాడు
– 12కేసుల్లో ఏ-2 ముద్దాయా.. చంద్రబాబు గురించి మాట్లాడేది
– పవన్ కళ్యాణ్ 48గంటల ఆల్టిమేటం అనడం విడ్డూరం
– విజయసాయిపై ఆగ్రహం వ్యక్తంచేసిన డిప్యూటీ సీఎం చినరాజప్ప
అమరావతి, మే24(జనం సాక్షి) : వెంకటేశ్వర స్వామిని సయితం రోడ్డుపైకి లాగాన్న వైసీపీ, బీజేపీ నేతల ప్రయత్నాలు సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తిరుమల విషయంలో టీడీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, బీజేపీ ఒప్పందం కుదుర్చుకుని టీడీపీని టార్గెట్ చేస్తున్నారని చినరాజప్ప విమర్శించారు. అసలు విజయసాయిరెడ్డి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునని, 12 కేసుల్లో ఏ-2 ముద్దాయని చినరాజప్ప అన్నారు. సీఎం చంద్రబాబు గురించి దేశ ప్రజలందరికీ తెలుసునని, 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో మచ్చలేని నేత అని మంత్రి పేర్కొన్నారు. జగన్‌కు ఉన్న తపన ఒక్కటేనని.. ఎవరు ఏమైపోయినా పర్వాలేదని, తనకు ముఖ్యమంత్రి పదవి కావాలనే ఆశతో ఉన్నారని చినరాజప్ప విమర్శించారు. టీడీపీ పాలనలో తప్పు జరగడానికి అవకాశాలు లేవని, రమణ దీక్షితులు 30 ఏళ్లుగా టీటీడీ ప్రధాన అర్చకులుగా పనిచేశారని, ఎప్పుడూ ఎలాంటి ఆరోపణలు చేయలేదని, ఏదో దురుద్దేశంతో ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వాళ్ల కేసుల గురించి చెప్పకుండా ఇతరుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 40ఏళ్లుగా చంద్రబాబు నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబును ఏవిూ చేయలేక పోయారని అన్నారు. పవన్ కళ్యాణ్ లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఉద్దానం ఘటనపై మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్దానం బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పటికే అక్కడ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం తెలిపారు. పవన్‌కు గుర్తొచ్చినప్పుడు అక్కడకు వెళ్లి 48గంటలు టైం ఇస్తాన్నా.. ఉద్దానం సమస్యను పరిష్కరించాలని అని ఆల్టమేటం జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే ఉద్దానంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్‌లతో సహా అన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. తెదేపా ప్రభుత్వం ఎక్కడ సమస్య
ఉన్నా వాటి పరిష్కారం కోసం పనిచేస్తుందని, ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు రానివ్వదని పేర్కొన్నారు.
————————